
నటి రమ్యకృష్ణ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కొన్ని మెమరబుల్ గా నిలిచిపోయిన, ఐకానిక్ పాత్రలైన అమ్మోరు, నీలాంబరి, బాహుబలిలోని శివగామి వెనుక ఉన్న అరుదైన విషయాలను పంచుకున్నారు. ఈ పాత్రలను ఎంచుకునేటప్పుడు ఆమెకు ఎదురైన సంఘర్షణలు, వాటిని అధిగమించి అవి ఎలా ఐకానిక్‌గా మారాయో ఆమె వివరించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో తరచుగా దేవతల పాటలు చూస్తుంటానని పేర్కొంటూ, ఐకానిక్ పాత్రల ఒత్తిడిపై చర్చ ప్రారంభమైంది. దీనికి సమాధానంగా, రమ్యకృష్ణ తాను ఏ పాత్ర ఐకానిక్ అవుతుందని ముందే ఊహించి చేయలేదని స్పష్టం చేశారు. అమ్మోరు చిత్రం గురించి ప్రస్తావిస్తూ, అదొక సాధారణ పాత్రగా భావించి చేశానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ అప్పట్లో ఆమె కెరీర్లోనే అత్యంత కఠినమైనదని వివరించారు. అల్లుడా మజాకా సినిమాతో అమ్మోరు విడుదలైనప్పుడు, అది కేవలం ఒక చిన్న సినిమాగా భావించాం. ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు పట్టుబట్టి ఆ పాత్ర చేయమని కోరారని, సౌందర్య మెయిన్ హీరోయిన్గా ఉన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు.
అప్పట్లో గ్రాఫిక్స్ కొత్తగా ప్రారంభమవుతున్న రోజులని, ఒక కర్రకు కట్టివేసి, పది చేతులు వచ్చేలా ఒకే పొజిషన్లో గంటల తరబడి ఉండాల్సి వచ్చేదని, ఇది శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టమైందని చెప్పారు. భోజనం అక్కడే, టాయిలెట్ సౌకర్యాలు కూడా లేకుండా ఆ షూటింగ్‌ను పూర్తి చేశానని తెలిపారు. ఇది తనను ఎంతో నేర్పిందని, ఆ తర్వాత అన్ని షూటింగ్‌లు సులువుగా అనిపించాయని రమ్యకృష్ణ అన్నారు. నీలాంబరి పాత్ర విషయానికొస్తే, అది ఒక నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కావడంతో మొదట నిరాకరించాలని అనుకున్నట్లు చెప్పారు. సౌందర్య అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న తరుణంలో, తాను నెగటివ్ పాత్ర చేయాలా అని అనిపించిందని. “ఆప్షన్స్ లేకుండా ఎంత మంచి రోల్ రైటర్ ఎంత గొప్ప అని ఫీల్ అయినా నెగటివ్ ఈజ్ నెగటివ్ బై ది ఎండ్ ఆఫ్ ది డే” అనే భావనతోనే ఆ పాత్రను మొదలుపెట్టానని అన్నారు. అయినప్పటికీ, కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రం తన వంద శాతం కృషిని అందించానని స్పష్టం చేశారు.
ఇక బాహుబలిలోని శివగామి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో తన కుమారుడికి ఆరు సంవత్సరాలు మాత్రమేనని, సీరియల్స్ నిర్మాణంతో తాను ఎంతో ఒత్తిడిలో ఉన్నానని వివరించారు. షూటింగ్‌కు 25 రోజులు కేటాయించడం కూడా కష్టంగా ఉన్న ఆ దశలో, శోభు గారు 40 రోజులు అడిగినప్పుడు తాను వెంటనే ఫోన్ పెట్టేసినట్లు తెలిపారు. తర్వాత శోభు గారు వచ్చి కథ వినమని కోరారని, రాజమౌళి గారి నెరేషన్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని, సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించిందని చెప్పారు. అదీ ఒక తల్లి పాత్ర అని, హీరోయిన్ నుండి తల్లి పాత్రకు మారినట్లు భావించి చేశానని, కానీ కెమెరా ముందు మాత్రం ఎప్పుడూ తన వంద శాతం అంకితభావాన్ని ప్రదర్శించానని రమ్యకృష్ణ వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి