
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ పరిశ్రమలో అడుగుపెట్టడమే కష్టం, అవకాశాన్ని అందిపుచ్చుకున్నా నిలదొక్కుకోవడం మరింత కష్టం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తమ ప్రతిభతో అందనంత ఎత్తుకు ఎదిగిన కొందరు తారలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఆయన అక్టోబర్ 23న తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. సినీ రంగంలోకి ప్రవేశించి 24 సంవత్సరాలు గడిచింది. ఈశ్వర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రభాస్, తన కెరీర్లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూశారు. అయినా, అందిన వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుని, కష్టపడి కృషి చేసి వరల్డ్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ప్రముఖ నటుడు కృష్ణం రాజు సోదరుని కుమారుడైన ప్రభాస్, సినిమా రంగంలోకి వచ్చాక కేవలం తన సొంత ప్రతిభతోనే అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఈశ్వర్ తో తెరంగేట్రం చేసిన ప్రభాస్, ఆ తర్వాత విజయాల వైపు తన అడుగులు వేశారు. శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, అభిమానులను అలరించింది. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఛత్రపతి సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచి, హీరోగా ప్రభాస్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ప్రభాస్ సినీ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన బిల్లా, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్, దశరథ్ డైరెక్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలు ప్రభాస్ రేంజ్‌ను మరింత పెంచాయి. ఈ సినిమాలు ఆయనకు రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే నటుడిగా గుర్తింపునిచ్చాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ను మరింత పటిష్టం చేసింది.
అయితే, ప్రభాస్ కెరీర్లోనే అత్యంత కీలకమైన, ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం బాహుబలి. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనాత్మక విజయాలు సాధించాయి. ఈ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించడమే కాకుండా, ప్రభాస్‌ను ప్రపంచ దేశాల్లో అభిమానులను సంపాదించుకునేలా చేశాయి. బాహుబలి తర్వాత ఆయన సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి, తన గ్లోబల్ స్టార్ ఇమేజ్ను కొనసాగించారు. తర్వాత కల్కి సినిమాతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ తో తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించారు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. సాలార్ 2, స్పిరిట్, కల్కి 2, ఫౌజీ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు ప్రభాస్. రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ప్రభాస్, తన పుట్టినరోజు సందర్భంగా మరింత విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.