
మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో నిర్మించిన కామెడీ డ్రామా చిత్రం ‘మొద రాత్రి’. రాజారాజన్ కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వినూత్నమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందామా.

మారుతి (రిషికాంత్) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఊరికి రావడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ అతనికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అయితే అతని కుటుంబ సభ్యులు మారుతికి తెలియకుండానే బుజ్జి లక్ష్మి (అనిష్మా)తో పెళ్లి నిశ్చయిస్తారు. పెళ్లి రోజున అతను ఊరికి చేరుకోగానే విషయాన్ని చెప్పి బలవంతంగా ఒప్పిస్తారు. మరోవైపు బుజ్జి లక్ష్మి కూడా ఈ పెళ్లిపై ఇష్టం లేకుండా ఉంటుంది.

ఆమె వేరొక యువకుడిని ప్రేమిస్తుంది. పెళ్లి సమయంలో తన ప్రేమికుడితో పారిపోవాలని వేసుకున్న ప్లాన్ ఫెయిల్ కావడంతో, మారుతితో ఆమెకు వివాహం జరిగిపోతుంది. పెళ్లి అనంతరం అదే రోజు రాత్రి శోభనానికి ఏర్పాట్లు జరుగుతాయి. అయితే, తన ప్రేమికుడు రాగానే ఎలాగైనా శోభనం రాత్రి అక్కడి నుంచి పారిపోవాలని బుజ్జి లక్ష్మి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె భర్త మారుతికి దొరికిపోతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ రాత్రి ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటి? భార్య ప్రేమ విషయాన్ని తెలుసుకున్న మారుతి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

ఇష్టం లేని పెళ్లి, పెళ్లి పీటల మీద నుంచి లేదా పెళ్లికి ముందు పారిపోయే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, పెళ్లి జరిగిపోయిన తర్వాత.. ఫస్ట్ నైట్ రోజున పారిపోవడానికి ప్రయత్నించిన భార్య, భర్తకి దొరికిపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే భిన్నమైన పాయింట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పెళ్లి హడావుడి, బంధువుల హంగామా, వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను చాలా సహజంగా చూపించారు. పెళ్లికి తెప్పించే ప్రత్యేకమైన మంచం చుట్టూ, నాటి సంప్రదాయాల చుట్టూ కామెడీని పండించే ప్రయత్నం చేశారు.

కథనంలో మానవీయ కోణాలు, అనుబంధాలు మరియు ప్రేమకు సంబంధించిన మంచి సందేశం ఉన్నప్పటికీ, కామెడీ గ్రాఫ్ అక్కడక్కడా తగ్గినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపించినా, పాత్రల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. యూత్‌కు, ముఖ్యంగా ప్రేమ, ఆకర్షణ మధ్య వ్యత్యాసాన్ని తెలిపే ఒక మంచి సందేశాన్ని అందిస్తూనే వినోదాన్ని పంచే ప్రయత్నం చేసింది 'మొద రాత్రి'. కథనంలో కొంత నెమ్మదనం ఉన్నప్పటికీ, వారాంతంలో కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక సరదా కామెడీ డ్రామా ఇది.