Kappi Squad Director Death: కల తీరిన రెండు రోజులకే విషాదం.. 27 ఏళ్లకే యువ దర్శకుడు బెల్‌రాజ్ కన్నుమూత!

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడిగా తన కలను నిజం చేసుకుని, తొలి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ దర్శకుడు బెల్‌రాజ్ కలరిక్కల్ (27) కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 15న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కాగా, అక్టోబర్ 17న కొచ్చిలోని ఓ హోటల్ గదిలో ఆయన మృతిచెందినట్లు తెలుస్తుంది.

Kappi Squad Director Death: కల తీరిన రెండు రోజులకే విషాదం.. 27 ఏళ్లకే యువ దర్శకుడు బెల్‌రాజ్ కన్నుమూత!
Kappi Squad Director

Updated on: Oct 17, 2026 | 9:36 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడిగా తన కలను నిజం చేసుకుని, తొలి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ దర్శకుడు బెల్‌రాజ్ కలరిక్కల్ (27) కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్ అక్టోబర్ 15న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కాగా, అక్టోబర్ 17న కొచ్చిలోని ఓ హోటల్ గదిలో ఆయన మృతిచెందినట్లు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణమై ఉండొచ్చని తెలుస్తుంది. అయితే మరణానికి ఖచ్చితమైన కారణంపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. సినిమా రంగంలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఎంతోకాలంగా కష్టపడుతున్న బెల్‌రాజ్‌కు కప్పి స్క్వాడ్ ప్రత్యేకమైన ప్రాజెక్ట్. సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన.. ఈ వెబ్ సిరీస్‌తో స్వతంత్ర దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తన దర్శకత్వంలో రూపొందిన తొలి సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొద్ది రోజులకే ఆయన మరణవార్త రావడం మలయాళ సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అక్టోబర్ 17న కొచ్చిలోని ఓ హోటల్ గదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆకస్మిక ఘటనతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన సహచరులు విషాదంలో మునిగిపోయారు. బెల్‌రాజ్ దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ సాధారణ వెబ్ సిరీస్‌లకు భిన్నంగా దీర్ఘకాలం కొనసాగించేలా రూపొందించిన ప్రాజెక్ట్. మొత్తం 100 ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. ప్రతి గురువారం నాలుగు కొత్త ఎపిసోడ్లను విడుదల చేసే విధంగా షెడ్యూల్ చేశారు.

శ్రీకాంత్ మోహన్ ఈ సిరీస్‌కు క్రియేటర్‌గా వ్యవహరించగా, రాహుల్ రిజి నాయర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 15, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు. యువత స్నేహాలు, జీవితంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన వంటి అంశాలతో కప్పి స్క్వాడ్ కథ సాగుతుంది. నలుగురు యువకులు కలిసి కేఫ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ప్రయత్నం, ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా కనిపిస్తాయి. రినోష్ జార్జ్, అనఘ అజిత్, దియా దీపన్, జోయెల్ జోసెఫ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ద్వారా బెల్‌రాజ్ దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలని ఆశించారు. దర్శకుడిగా మారకముందు బెల్‌రాజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘నిజల్’, ‘మధురం’, ‘డాకిని’ వంటి చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఈ అనుభవం ద్వారా సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాలపై అవగాహన పెంచుకున్నారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఆయనకు ‘కప్పి స్క్వాడ్’ తొలి దర్శకత్వ అవకాశంగా నిలిచింది. అయితే తన కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆయన మరణవార్త రావడం అత్యంత బాధాకరం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us