Hyper Aadi: నా ఈ జీవితం అతను పెట్టిన భిక్షే.. ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేస్తే..

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన కెరీర్ ప్రస్థానాన్ని వివరించారు. చిన్న పాత్రల నుండి టీమ్ లీడర్‌గా ఎదిగే క్రమంలో ఆదిరే అభి అందించిన అపారమైన మద్దతును గుర్తుచేసుకున్నారు. సునీల్ గారితో తన తొలి స్కిట్ అనుభవం, ఆపై టీమ్ లీడర్‌గా మారిన తీరును ఆది పంచుకున్నారు. అభి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.

Hyper Aadi: నా ఈ జీవితం అతను పెట్టిన భిక్షే.. ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేస్తే..
Hyper Aadi

Updated on: Mar 29, 2026 | 2:22 PM

ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్‌లో తన విజయ ప్రస్థానం, దానికి కారణమైన ఆదిరే అభి మద్దతు గురించి వివరించారు. కాలేజీ రోజుల్లో సాధారణ విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక జబర్దస్త్ కమెడియన్‌తో ఫోటో దిగితే వచ్చిన లైక్‌లు, టీవీలో కనిపించాలనే ఆకాంక్షను కలిగించాయని ఆది గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి, ఆదిరే అభికి నిరంతరం మెసేజ్‌లు పంపుతూ స్కిట్‌లో అవకాశం కోసం రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఆది పట్టుదలను చూసిన అభి, చివరకు అతనికి అవకాశం కల్పించారు. సునీల్ గెస్ట్‌గా వచ్చిన ఒక స్కిట్‌లో హైపర్ ఆది తన మొదటి పాత్రను పోషించారు. ఆ స్కిట్‌లో సునీల్ రిక్షాలో కూర్చుని ఉండగా, ఆది రిక్షాను లాక్కొచ్చి దిగిపోవాలి. ఈ చిన్న పాత్ర చేసిన తర్వాత ఆది చాలా ఉత్సాహంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, ప్రేక్షకుల నుంచి అనుకున్న స్పందన రాలేదు. తనను పాజ్ చేసి చూస్తే తప్ప ఎవరికీ కనిపించలేదని, కేవలం రిక్షా లాగే పాత్రకు ఇంత హడావిడా అని వచ్చిన కామెంట్లు ఆయన్ను నిరాశపరిచాయి. అయితే, ఈ అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకున్న ఆది, కేవలం కనిపించడం కాకుండా స్కిట్‌లో ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి అదిరే అభి టీంలోనే చిన్నగా డైలాగులు రాయడం ప్రారంభించారు. క్రమంగా స్కిప్ట్‌లు కూడా రాయడం అలవడింది.

ఆది ప్రతిభను గుర్తించిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఆయన్ను టీమ్ లీడర్‌గా ప్రమోట్ చేసింది. టీమ్ లీడర్‌గా మారిన తర్వాత హైపర్ ఆది సాధించిన ఒక ముఖ్యమైన విజయం ఏమిటంటే, తన మొదటి స్కిట్‌లో రిక్షాలో తీసుకువచ్చిన సునీలే, టీమ్ లీడర్‌గా తాను చేసిన స్కిట్‌లో భాగమై, ఆయనపై పంచ్‌లు వేసే స్థాయికి ఎదగడం. ఈ మొత్తం ప్రయాణంలో ఆదిరే అభి మద్దతు ఎంతో కీలకమని హైపర్ ఆది తెలిపారు. ఆదిరే అభి లేకపోతే ఈరోజు ఈ స్థానంలో తాను ఉండేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఆదిని టీమ్ లీడర్‌గా చేయాలని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అభికి చెప్పినప్పుడు, అభి బాహుబలి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. తన స్కిట్‌లకు ఆది లేకపోతే ఎలా అని మొదట సందేహించినా, ఆ తర్వాత వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని, ఆది టీమ్ లీడర్‌గా మారితే తాను స్కిట్‌లు రాస్తానని చెప్పి పూర్తి మద్దతు పలికారు. అభి అందించిన ఈ అమూల్యమైన మద్దతుతో ఆది టీమ్ లీడర్‌గా దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం తనకు వస్తున్న అవకాశాలకు, చేస్తున్న సినిమాలకు, సంపాదిస్తున్న రూపాయలకు, లభిస్తున్న కాంప్లిమెంట్స్ అన్నింటికీ మూల కారణం అభి అన్నేనని ఆది స్పష్టం చేశారు. “అభి అన్న లేకపోతే ఈ రోజు అసలు నేను ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చేవాడిని కాదు” అని ఆది అన్నారు. అభి ఆల్ రౌండర్ పర్ఫార్మర్‌గా, కామెడీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, యాంకర్, హీరో పాత్రలు పోషించి, ఇప్పుడు దర్శకత్వం కూడా చేస్తున్నారని, ఏం చేసినా అందులో కొత్తదనం చూపిస్తూ విజయం సాధిస్తున్నారని ఆది ప్రశంసించారు.

Also Read: Ramaprabha: అంతటి అందం, గుణం, ఆడతనం ఉన్న హీరోయిన్‌ని నేను ఇంతవరకూ చూడలేదు.. 

Follow Us