
అందాల ఆరబోతకు దూరంగా ఉంటూనే తనదైన నటనతో వీక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో గోపిక ఒకరు. తక్కువ సినిమాల్లో నటించినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రేజీ హీరోయిన్. గోపిక పేరు చెప్పగానే రవితేజతో కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన జ్ఞాపకాలను, ముఖ్యంగా కాలేజ్ జీవితాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ సినిమా విజయానికి రవితేజ, గోపికల నటన కూడా అంతే ముఖ్యమని చెప్పవచ్చు. ఈ సినిమాలో లతిక అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. రవితేజ, గోపిక మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా మంది అందరిని ఆకట్టుకుంది. చిన్నతనం నుండే శాస్త్రీయ నృత్యం నేర్చుకుని, కమల్ హర్ శిక్షణలో మంచి నృత్యకారిణిగా మారింది గోపిక. కాలేజ్ సమయంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ కాలేజ్ గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ త్రిసూర్ పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. కొన్నాళ్లపాటు మోడలింగ్ చేసింది. తాను ఎయిర్ హోస్టెస్ కావాలని అనుకున్నానని, మిస్ కాలేజ్ అయ్యాక అనుకోకుండా మోడలింగ్‌కు వచ్చానని ఒక ఇంటర్వ్యూలో గోపిక వెల్లడించింది.
మోడలింగ్ చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ తులసిదాస్ తన సినిమాకు గోపిక హీరోయిన్‌గా సరిపోతుందని భావించి ఆమెను సంప్రదించారు. తొలుత సినిమాల్లోకి వచ్చేందుకు నిరాకరించిన గోపిక, ఒకటి రెండు సినిమాలు చేసి తిరిగి చదువును కొనసాగించాలని భావించి అంగీకరించిందట. అలా మొదటిసారిగా మలయాళంలో 2002 అక్టోబర్ 18న విడుదలైన ప్రాణయామణి తూవల్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో వినీత్ కుమార్, జయసూర్యలతో కలిసి నటించిన గోపిక, మీరా పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాలోనే గిర్లి ఆంటో పేరు గోపికగా మారింది. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలంటే పేరు కూడా విలక్షణంగా, సులభంగా గుర్తుండేలా ఉండాలని డైరెక్టర్ చెప్పడంతో ఆమె తన స్క్రీన్ నేమ్‌ను గోపికగా మార్చుకుంది.
ప్రాణాయామణి తూవల్ సినిమా యావరేజ్‌గా నిలిచినా, ఆ తర్వాత వచ్చిన ఫర్ ద పీపుల్ (2004) చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 40 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసి, మలయాళంలో ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో యువసేన పేరుతో విడుదలైనప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. అదే ఏడాది తమిళంలో చరణ్ దర్శకత్వంలో వచ్చిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళనాడులో సంచలన విజయం సాధించి, మూడు నేషనల్ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఇదే చిత్రం తెలుగులో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ పేరుతో రీమేక్ కాగా, గోపికకు తెలుగు ప్రేక్షకులలో మంచి పేరు వచ్చింది. తెలుగులో ఆమె నటించిన ఇతర చిత్రాలలో లేత మనసులు, ముద్దుల కొడుకు, వీధి వంటివి ఉన్నాయి. 2006లో మలయాళంలో వచ్చిన కీర్తిచక్ర సినిమా కూడా సూపర్ హిట్టై, మోహన్ లాల్, జీవా వంటి ప్రముఖ నటులతో కలిసి నటించిన గోపికకు అవార్డులను తెచ్చిపెట్టింది.
గోపిక తన కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. 2004లో వేషం సినిమాకు ఏషియా నెట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు, 2006లో కీర్తిచక్ర సినిమాకు బెస్ట్ పెయిర్ అవార్డు గెలుచుకుంది. 2009లో వెరుతే ఓరు భార్య చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఏషియా నెట్, వనితా ఫిల్మ్ అవార్డులు పొందింది. 2008లో డాక్టర్ అజిలేష్ చాకోని గోపిక వివాహం చేసుకుంది. వివాహం తర్వాత గోపిక సినిమాల నుంచి విరామం తీసుకుని వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చింది. ప్రస్తుతం అజిలేష్‌తో కలిసి బ్రిస్బేన్‌లో స్థిరపడిన గోపికకు అమైయా అనే కుమార్తె, ఆ తర్వాత ఇడెన్ అనే కుమారుడు ఉన్నారు. గోపిక ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే తిరిగి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధంగా ఉన్నానని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి