
సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి సందడి నెలకొంది. టాలీవుడ్ స్టార్స్ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లిపీటలెక్కనున్నారు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన తేజ సజ్జా.. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ 2తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. మరోవైపు ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షోతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తేజ సజ్జా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.
వచ్చే నెలలో (నవంబర్) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను తేజ సజ్జా నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా తేజ సజ్జా మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయిలో పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ వివాహాన్ని మా తల్లిదండ్రులు నిశ్చయించారు. పెద్దల సమక్షంలో కుదిరిన సంబంధం ఇది. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్లో వివాహం జరగనుంది. రాజస్థాన్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని తేజ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరో పెళ్లి గురించి కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న తేజ్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అయితే కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బైక్ ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్.. తిరిగి వచ్చి ‘విరూపాక్ష’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో.. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే తేజ్ పెళ్లి జరగనుందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే వధువు ఎవరు.? ఆమె నేపథ్యం ఏమిటి.? పెళ్లి తేదీ ఎప్పుడు.? వంటి వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ వార్తలపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.