
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో బుల్లెట్లు ఎలా పేలుతుంటాయో ఆయన నోటి నుంచే వచ్చే మాటలు కూడా అలాగే పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ ప్రారంభించిన ‘ పూరీ మ్యూజింగ్స్’ కు ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. మన జీవితానికి సంబంధించి అన్న రకాల అంశాలను తన దైన శైలిలో విశ్లేషిస్తుంటారు పూరి. తాజాగా ఆయన యాటిట్యూడ్ అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నీ యాటిట్యూడ్ వల్ల నీ చుట్టూ ఉన్న ప్రపంచమేమీ మారిపోదు. కానీ, నీలోని ప్రపంచం మాత్రం మారుతుంది. ఒక పెను తుపానులో రెండు ఇళ్లు సముద్రంలో కొట్టుకొని పోయాయి. అన్నీ కోల్పోయి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకొకడు ఏదో చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ నవ్వుతూ కనిపిస్తాడు. ఒకడు కుంగిపోతాడు. మరొకడు బతికాననుకుంటాడు. మీకు నెగెటివ్ థాట్స్ ఉంటే దీవెనలు కూడా దరిద్రంగా అనిపిస్తాయి. అదే మీరు కాన్షియస్ మైండ్ తో ఉంటే కష్టాలు కూడా అవకాశాల్లా కనిపిస్తాయి. ప్రపంచంలో ఏదీ నీకు మాత్రమే వ్యతిరేకంగా జరగదు. ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి. అందులో జస్ట్ నువ్వు కూడా ఉన్నావంతే. అలాంటప్పుడే మన యాటిట్యూడ్ మనకు సాయం చేస్తుంది. ఆ తుపానులో నువ్వు బాధ పడతావా? అనుభూతి చెందావా? అన్నది నీ ఇష్టం. ప్రతి విషయాన్ని కంప్లైంట్ చేసుకుంటూ పోతే నీకే నష్టం’
‘ఎప్పుడూ ఏడుస్తూ బతకాలి అని అనుకున్న వారికి చుట్టూ వేల కారణాలు కనిపిస్తుంటాయి. బయట జరిగేదేదీ మన చేతిలో ఉండదు. కానీ, దానిపై ఎలా స్పందించాలనేది మాత్రం మన ఆలోచనలు, చేతుల్లోనే ఉంటుంది. రైట్ యాటిట్యూడ్ ఉన్నోడిని ఎవరూ ఓడించలేరు. ఎందుకంటే వాడు జీవితానికి ఎదురెళ్లడు. జీవితమనే నదిలో ఒదిగిపోతూ ముందుకు పోతుంటాడు. వాడిని ఎవరూ ఆపలేరు. ఏమీ చేయలేరు కూడా. వర్షంలో తడవాల్సి వస్తే తడువు. ఎండలో ఉండాల్సివచ్చినప్పుడు ఉండిపో. అప్పుడే నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది’
‘ప్రతి చిన్న విషయానికి భయపడే లక్షణం ఉంటే నెమ్మదిగా మార్చుకోండి. భయపడకపోతే ఇదే జీవితంలో మీ అనుభవం మరోలా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మన క్యారెక్టర్ ఎలా ఉన్నా ఫర్వాలేదు. కానీ ఒరిజినల్‌గా ఉంటే చాలు. ఎవరి కోసమూ యాక్ట్ చేయాల్సిన పనిలేదు. మన కష్టాలన్నింటినీ తట్టుకోవాలన్నా.. పడి లేవాలన్నా.. పరిగెత్తాలన్నా మనకు కావాల్సింది యాటిట్యూడ్’ అని పూరీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.