
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి చేరింది. అయితే సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతోనూ మారుతి వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్‌తో తనకు జరిగిన గొడవ గురించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మారుతి దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమా ‘ఈ రోజుల్లో’. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మారుతికి దర్శకుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఈ రోజుల్లో సినిమా తర్వాత ‘బస్ స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు మారుతి. ముఖ్యంగా హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో మారుతి పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. నేచురల్ స్టార్ నాని హీరోగా మారుతి తెరకెక్కించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఆయన కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. మతిమరుపు నేపథ్యంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాతో నాని క్రేజ్ కూడా మరింత పెరిగింది. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘బాబు బంగారం’, శర్వానంద్‌తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజా రెడ్డి అల్లుడు’, సాయిధరమ్ తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’, సంతోష్ శోభన్‌తో ‘మంచి రోజులు వచ్చాయి’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే.. మారుతి కెరీర్‌లో తెరకెక్కిన ‘బాబు బంగారం’ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నయనతారతో ఆయనకు విభేదాలు వచ్చినట్లు గతంలో వెల్లడించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా, నయనతార హీరోయిన్‌గా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి మారుతి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మారుతి వెల్లడించిన వివరాల ప్రకారం.. షూటింగ్ సమయంలో నయనతార నుంచి చిత్రబృందానికి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని చెప్పారు. తాను అప్పట్లో పెద్ద దర్శకుడిని కాకపోవచ్చు కానీ, సీనియర్ హీరో వెంకటేష్‌తో పనిచేస్తున్నప్పుడు కనీస గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను చాలా ఓపికగా ఉన్నానని తెలిపారు. అయితే ఒకానొక సమయంలో నయనతారతో తనకు వాగ్వాదం జరిగిందని మారుతి గతంలో చెప్పారు. ఈ వివాదం కారణంగా ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయారని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాబు బంగారం సినిమా చివర్లో ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా, అందుకోసం నయనతార డేట్స్ అడిగామని మారుతి తెలిపారు. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేనని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ఆ పాటను చిత్రీకరించకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని మారుతి పేర్కొన్నారు. ఇక మారుతి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్టుగా నిలిచిన సినిమా ‘ది రాజా సాబ్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ది రాజా సాబ్ ఫలితం తర్వాత మారుతి తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. 2026 మార్చిలో తన కొత్త సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి