మూడు నెలల పాటు రోజు ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను.. నాకు యాంకరింగ్ స్కిల్స్ నేర్పింది వారే

బుల్లి తెరపై స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. కానీ మేల్ యాంకర్స్ లో మాత్రం ప్రదీప్ మాచి రాజుకు మంచి పేరు ఉంది. ఎన్నో షోలకు ప్రదీప్ యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. గతకొంతకాలంగా ప్రదీప్ టీవీల్లో కనిపించడం లేదు.

మూడు నెలల పాటు రోజు ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను.. నాకు యాంకరింగ్ స్కిల్స్ నేర్పింది వారే
Pradeep Machiraju

Updated on: May 26, 2026 | 9:27 AM

యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణించాడు ప్రదీప్. యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్.. ఆతర్వాత హీరోగా మారాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా.? అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి సినిమాల్లో హీరోగా నటించాడు. కాగా తన మీడియా ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను, విజయాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రేడియోలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. రేడియోలో మనం కనిపించం కాబట్టి, బాధలో ఉన్నప్పటికీ ఉత్సాహంగా మాట్లాడే విధానాన్ని గుర్తుచేసుకున్నారు. సరదాగా, అర్థమయ్యే రీతిలో మాట్లాడటమే తన లక్ష్యమని తెలిపాడు ప్రదీప్. రేడియో నుంచి టెలివిజన్‌లోకి మారడం ఒక పెద్ద సవాలని, టెలివిజన్‌లో నన్ను నేను మెరుగుపరుచుకోవడం, ఎలాంటి దుస్తులు ధరించాలి, శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఉంచుకోవాలి, మాట్లాడే మాటలు, ప్రేక్షకులను అర్థం చేసుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలని వివరించాడు ప్రదీప్. ప్రదీప్ తన కెరీర్‌లో పిల్లలు, విద్యార్థులు, మహిళలు, దంపతులు, వృద్ధులు, అవసరమైన వారితో ఛారిటీ ఫండ్‌రైజింగ్ షోలతో సహా అనేక రకాల షోలను చేశాడు.

అలాగే సింగింగ్, డ్యాన్స్ షోలు, టాప్ సెలబ్రిటీలతో టాక్ షోలు, తన సొంత ప్రొడక్షన్‌లో షోలు నిర్మించాడు. “మా అమ్మలాంటి వారు, వారి పిల్లలతో కలిసి చూడగలిగే షోలు చేయాలి” అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు ఛానెల్‌ మార్చాలనిపించే షోలు కాకుండా, కుటుంబ సభ్యులందరూ కలిసి గంటసేపు చూడగలిగే వినోదాన్ని అందించడమే తన లక్ష్యం అని తెలిపాడు. చిన్నపిల్లలు కూడా తనను గుర్తించి “ప్రదీప్ అన్న”, “ప్రదీప్ మామ” అని పిలవడం ఆనందంగా ఉంటుందని చెప్పాడు. టీవీని ప్రజల హృదయాల్లోకి చేరుకోవడానికి ఒక శక్తివంతమైన మాధ్యమం అని తెలిపాడు ప్రదీప్. సినిమాలలోకి తన ప్రవేశం గురించి ప్రదీప్ మాట్లాడుతూ..

అది ఒక మహా సముద్రం అని పేర్కొన్నాడు. తన మొదటి సినిమాలో యాంకర్ ప్రదీప్ కాకుండా, దర్శకుడు సృష్టించిన పాత్రనే చూపించడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి తన పాత్రలో కొత్తదనం చూడాలని ఆయన ఆకాంక్షించాడు. అవకాశాల కోసం తన ప్రారంభ పోరాటాలను ప్రదీప్ గుర్తుచేసుకున్నాడు. రేడియోలో స్థానం కోసం మూడు నెలల పాటు రోజు ఆఫీస్‌కు వెళ్లినట్లు, “మాకు ఓకే అయితే ఫోన్ చేస్తాం” అని చెప్పినా కూడా, “నన్ను చూస్తే మీకు గుర్తుంటుంది కదా” అని వెళ్లి కలిసేవాడిని చెప్పాడు ప్రదీప్. టెలివిజన్‌లో కూడా, హైదరాబాద్‌లోని ఒక లోకల్ ఛానెల్‌లో అనితా ఆప్టే, స్వప్న ద్వారా ఒక చిన్న లైవ్ షోతో ప్రారంభమైన తన ప్రయాణం, బాగా విజయవంతమై గంటకు పెరిగింది. తరువాత జీ టీవీ తనను గుర్తించి అవకాశమిచ్చింది. కెమెరా అంటే ఏమిటో తెలియని రోజుల్లో, ప్రభాకర్, ముమైత్ ఖాన్, చిన్ని ప్రకాష్ మాస్టర్ వంటి సీనియర్లు కెమెరా ఫేసింగ్, రెడ్ లైట్ చూసి మాట్లాడటం వంటి మెలకువలు నేర్పారని ప్రదీప్ తెలిపాడు.  ఒక అవకాశం కోసం వేల, లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నాకు ఆ బాధ తెలుసు.. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లు చేసి తమను తాము నిరూపించుకోవాలని, వైరల్ అయితే కంపెనీలు కచ్చితంగా గుర్తిస్తాయని ప్రదీప్ సలహా ఇచ్చాడు. తన టైంలో యూట్యూబ్, ఇంటర్నెట్ అంతగా లేవని గుర్తుచేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us