
తెలుగు నాట రాముడు అనగానే మహానటుడు ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. రాముడు టైటిల్‌తో రూపొందిన అనేక చిత్రాల్లో నటించి ఆయన అభిమానులను అలరించారు. పాతాళభైరవిలో తోటరాముడు పాత్రతో అలరించిన ఎన్టీఆర్, తొలిసారిగా రాముడు అనే పేరుతో నటించిన పూర్తి నిడివి చిత్రం అగ్గిరాముడు. ఈ చిత్రం తదనంతర కాలంలో అనేక రాముడు టైటిల్ చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. అగ్గిరాముడు చిత్రాన్ని పక్షిరాజా ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఎం. శ్రీనివాసులు నాయుడు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవడానికి శ్రమించిన నిర్మాతల్లో శ్రీనివాసులు నాయుడు ప్రముఖులు. ఆయన నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత కూడా. కోయంబత్తూరులో ఆయనకు పక్షిరాజా పేరుతో స్టూడియో ఉండేది. 1910లో తిరుచ్చిలో పుట్టిన శ్రీనివాసులు నాయుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాలు తీసి విజయాలు సాధించి పరిశ్రమకు ఎంతో మేలు చేశారు. నారాయణన్ కంపెనీ అధినేత నారాయణ అయ్యంగార్ 1940లో పక్షిరాజా ఫిలిమ్స్ ను స్థాపించగా, అందులో శ్రీనివాసులు నాయుడు భాగస్వామిగా చేరారు. ఈ సంస్థ తమిళంలో పలు చిత్రాలు నిర్మించింది. నారాయణన్ కన్నుమూసిన తర్వాత పక్షిరాజా సంస్థను, స్టూడియోను శ్రీనివాసులు నాయుడు సొంతం చేసుకుని చిత్ర నిర్మాణం కొనసాగించారు. ఆయన సొంతంగా నిర్మించిన తొలి చిత్రం 1950లో విడుదలైన బేదల పాట్లు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు కె. రామనాథ్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ చిత్రంలో నాగయ్య హీరో. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా లక్ష రూపాయల పారితోషికం ఈ సినిమాతోనే చిత్తూరు వి. నాగయ్య తీసుకున్నారు. లలిత, పద్మిని, తిరువాన్కూర్ సిస్టర్స్ గా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఆరుద్ర తొలి సినిమా పాట రాసింది కూడా “బేదల పాట్లు” చిత్రంతోనే.
ఆ తర్వాత శ్రీనివాసులు నాయుడు 1952లో “కాంచన”, 1953లో “ఒక తల్లి పిల్లలు” వంటి చిత్రాలు తీశారు. రాబిన్ హుడ్ కథలాంటి ఇతివృత్తంతో వచ్చిన హిందీ చిత్రం “బాదల్”ను తమిళ, తెలుగు భాషల్లో డబ్ చేశారు. ఈ విజయం స్ఫూర్తితో, అదే ధోరణిలో ఉన్న ఒక తమిళ నవలను కొని, స్వీయ దర్శకత్వంలో ఎంజీఆర్, భానుమతి జంటగా “మలైక్కళ్ళన్” పేరుతో 1954లో తమిళంలో తీశారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో, వెంటనే ఎన్టీఆర్‌తో “అగ్గిరాముడు” పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. భానుమతి ఇందులోనూ హీరోయిన్‌గా నటించారు. “అగ్గిరాముడు” చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా, ఆయన భానుమతితో కలిసి నటించిన మూడవ చిత్రం. రోప్ కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని తొలిసారిగా ఈ సినిమాలో ఉపయోగించారు, ఇది అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హోగెనక్కల్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బుర్రకథా పితామహుడుగా ప్రసిద్ధి చెందిన షేక్ నాజర్ బృందంతో చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆచార్య ఆత్రేయ మాటలు, పాటలు రాశారు, ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకుడు. ఈ చిత్రాల్లో నటించిన ఎంజీఆర్ (తమిళనాడు ముఖ్యమంత్రిగా), ఎన్టీఆర్ (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా) తదనంతర కాలంలో అధికారంలోకి వస్తారని ఆ రోజుల్లో ఎవరూ ఊహించలేదని చెప్పడం ఒక విచిత్రమైన యాదృచ్ఛికం. 1954 ఆగస్టు 5న విడుదలైన “అగ్గిరాముడు” విజయవంతమై, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో 100 రోజులు ఆడింది. మచిలీపట్నంలోని సరస్వతి టాకీస్ లో జరిగిన 100 రోజుల వేడుకలకు ఎన్టీఆర్, రేలంగి, శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. ఆ తర్వాత శ్రీనివాసులు నాయుడు ఈ కథను హిందీలో దిలీప్ కుమార్ హీరోగా “ఆజాద్” పేరుతో, కన్నడలో కళ్యాణ్ కుమార్, మైనవతి జంటగా “బెట్టద కళ్ళ” (1957) పేరుతో, మలయాళంలో సత్యన్, రాగిణి జంటగా “తస్కవీరన్” (1957) పేరుతో, సింహళంలో “సూరసేన” పేరుతో నిర్మించి వరుస విజయాలు అందుకున్నారు. ఇలా ఒకే కథను ఆరు భాషల్లో నిర్మించి అద్భుత విజయం సాధించడం శ్రీనివాసులు నాయుడు బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం.