
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలకు ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘ప్రేమ ఖైదీ’. ఈ సినిమాతో పరిచయమైన హరీష్ తన అమాయకత్వంతో, నటనతో అప్పట్లో అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారిపోయారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయమై, అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200 సినిమాల్లో నటించిన ఘనత హరీష్ సొంతం. హరీష్ ప్రస్థానం బాలనటుడిగా మొదలైంది. ఎన్టీఆర్ లాంటి దిగ్గజాల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘ప్రేమ ఖైదీ’ హిందీలో కూడా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘనవిజయం సాధించడంతో హరీష్‌కు బాలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తట్టాయి.
కరిష్మా కపూర్‌తో కలిసి ఆయన చేసిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్. ఒక దశలో బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా హరీష్ ఎదిగారు. కానీ ఆ స్టార్డమ్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కొన్ని పొరపాట్లు చేశారు. ముఖ్యంగా మలయాళంలో కొన్ని బి-గ్రేడ్ లేదా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం హరీష్ కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఆర్థిక కారణాల వల్లనో లేదా తప్పుడు నిర్ణయాల వల్లనో ఆయన ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటివరకు ఉన్న ‘క్లీన్ లవర్ బాయ్’ ఇమేజ్ ఒక్కసారిగా దెబ్బతింది.
మరోవైపు హరీష్ సినిమాల్లో ఉండగానే కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. అయినా కూడా బి-గ్రేడ్ ముద్ర ఆయన కెరీర్ గ్రాఫ్‌ను కిందికి లాగేసింది. హిందీలో గోవిందాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కొన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినా, అప్పటికే హరీష్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయాయి. స్టార్డమ్‌ను హ్యాండిల్ చేయడం తెలియకపోవడం, వరుసగా తప్పుడు కథలను ఎంచుకోవడం వల్ల ఒక అద్భుతమైన హీరో ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా, 90ల నాటి ప్రేక్షకులకు హరీష్ అంటే ఇప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే.