Actor Akash: ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’.. సునీల్‌పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు

నటుడు ఆకాష్, సునీల్ నటించిన ‘అందాల రాముడు’ చిత్రంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను హీరోగా చేస్తున్న సినిమాను వదులుకుని సునీల్ కోసం ఆ పాత్ర చేశానని, అయితే సినిమా విజయం సాధించిన తర్వాత సునీల్ తన కృషిని గుర్తించలేదని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Actor Akash: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు.. సునీల్‌పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు
Actor Akash On Sunil

Updated on: Feb 27, 2026 | 12:10 PM

నటుడు ఆకాష్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ముఖ్యంగా నటుడు సునీల్‌తో తన అనుభవాల గురించి మాట్లాడారు. సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలను ఆయన వెల్లడించారు. పిలిస్తే పలుకుతా సినిమా సమయంలో తనకు ఫ్రెండ్‌గా చేసిన సునీల్‌కు మాట ఇచ్చినందున, సునీల్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఆకాష్ అంగీకరించారు. ఆ సమయంలో ఆకాష్ తమిళంలో విజయకాంత్ డైరెక్టర్ తీస్తున్న వెట్టై అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే, సునీల్ ఫోన్ చేసి అందాల రాముడు (తమిళ చిత్రం సుందర పురుషన్ రీమేక్)లో రెండో హీరో పాత్ర చేయమని కోరారు. ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, డెవలప్ చేస్తానని సునీల్ ఒప్పించారని ఆకాష్ తెలిపారు. సునీల్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, తాను తమిళంలో హీరోగా చేస్తున్న సినిమాను నిలిపివేసి, అందాల రాముడులో నటించడానికి అంగీకరించానని ఆకాష్ పేర్కొన్నారు.

ఆకాష్ తెలిపిన వివరాల ప్రకారం, అందాల రాముడు సినిమా షూటింగ్ సమయంలో సునీల్ ప్రతిరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత తన చేయి పట్టుకుని, “ఇది నీ కాళ్ళు అనుకో భయ్యా, చాలా థ్యాంక్స్, నిన్ను జీవితంలో మర్చిపోను” అని చెప్పేవారట. అయితే, సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత, సునీల్ తన గురించి ఏ ఇంటర్వ్యూలలోనూ ప్రస్తావించలేదని, ఒక్క పోస్టర్‌లో కూడా తన ఫోటో పెట్టలేదని ఆకాష్ ఆరోపించారు. ఈ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని, తాను సునీల్‌కు తన అసంతృప్తిని నేరుగా వ్యక్తం చేశానని తెలిపారు.

కొన్నాళ్ళ తర్వాత, దర్శకుడు శ్రీను వైట్ల ఢీ అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. ఢీ ప్రమోషన్స్ కోసం ఓ ఛానల్‌కు శ్రీను వైట్ల, సునీల్ కూర్చున్నప్పుడు.. ఆకాష్ శ్రీను వైట్లకు ఫోన్ చేశారు. అప్పుడు శ్రీను వైట్ల ఆకాష్‌ను లక్కీ మాస్కాట్ అని ప్రశంసించారు. ఆ సమయంలో శ్రీను వైట్ల ప్రస్తావించిన తర్వాత మాత్రమే సునీల్, “అవును, ఆకాష్ నా కోసం అందాల రాముడు చేశాడు” అని చెప్పారని ఆకాష్ వెల్లడించారు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా సునీల్‌లో కృతజ్ఞతాభావం లేదని ఆకాష్ వ్యాఖ్యానించారు. అందాల రాముడు తమిళ వెర్షన్‌లో తన పాత్రకు పాట ఉందని, తెలుగులో కూడా పాట ఉంటుందని సునీల్ చెప్పారని, కానీ అది జరగలేదని ఆకాష్ తెలిపారు. ఈ విషయంపై దర్శకుడిని అడిగితే, సునీలే వద్దన్నారని చెప్పినట్లు ఆకాష్ పేర్కొన్నారు.

ఈ అనుభవాలు తనను ఎంతగానో బాధించాయని, సిద్దార్థ్, రాజా వంటి నటులు ఇండస్ట్రీ నుంచి ఎందుకు దూరమయ్యారో ఆలోచించాలని ఆయన అన్నారు. తాను ఇష్టపడి సినిమా కోసం ఒక్క పైసా కూడా తీసుకోకుండా పనిచేశానని, కానీ తన కృషికి గుర్తింపు లభించలేదని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డబ్బు సంపాదించకపోయినా, మంచి చేశానని, దేవుడు ఉంటే తనకు మళ్లీ తెలుగులో మంచి జీవితం వస్తుందని ఆకాష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: తక్కువ ఖర్చుతో కోళ్లకు మేతగా పురుగులు ఇలా తయారు చేస్కోండి 

 

Follow Us