
తాజాగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ ఒకరు మన సూపర్ స్టార్ గ్లామర్, స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా, సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి. ఆయన వయసు పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ కూడా పెరుగుతూనే ఉంటుంది. నలభై ఏళ్ల ప్రాయంలోనూ పాతికేళ్ల యువకుడిలా కనిపించడం ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య. వెండితెరపై ఆయన నడక, ఆ హుందాతనం చూసి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు తాజాగా టీమ్ ఇండియాకు చెందిన ఒక స్టార్ ఆల్ రౌండర్ ఆయన వీరాభిమానిగా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ హడావిడిలో ఉన్నప్పటికీ, మన హీరో స్టైల్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు ఆ క్రికెటర్. ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు.. మహేష్ బాబు.
టీమ్ ఇండియా హిట్టర్ శివమ్ దూబే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ఇష్టాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినిమాల ప్రస్తావన రాగా, ఆయన మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూస్తుంటాను. ముఖ్యంగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా క్లాస్‌గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ అద్భుతంగా ఉంటాయి” అని దూబే పేర్కొన్నారు. హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాల ద్వారా మహేష్ బాబుకు తాను ఫ్యాన్ అయిపోయానని ఆయన వెల్లడించారు.
Dube And Maheshbabu
కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ చేసే విధానం ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమా చూశాను, అందులో ఆయన నటన అద్భుతం” అని ప్రశంసించారు. దీంతో క్రికెట్ మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే శివమ్ దూబేకు టాలీవుడ్ హీరోలంటే ఇంత క్రేజ్ ఉందా అని అభిమానులు మురిసిపోతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో మహేష్ బాబు ‘పాన్ వరల్డ్’ హీరోగా మారబోతున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబుకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు రాజమౌళి తోడవ్వడంతో ఈ క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. శివమ్ దూబే వంటి జాతీయ స్థాయి ఆటగాళ్లు మహేష్ గురించి మాట్లాడటం, ఆయన పాన్ ఇండియా ఇమేజ్ కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ హీరోల హవా దేశవ్యాప్తంగా ఎలా ఉందో శివమ్ దూబే మాటలను బట్టి అర్థమవుతోంది.