Singer Ghantasala Venkateswara Rao: అతడు ప్రసన్న మధుర భావార్ర్ద మూర్తి. సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి. లలిత గంధర్వ దేవత కొలువుదీరు… కలికి ముత్యాలశాల మా ఘంటసాల అన్నాడు జంధ్యాల పాపయ్యశాస్త్రి. అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఊయల.. తీయని గాంధర్వ హేల…గాయకమణి ఘంటసాల అన్నాడు సి.నారాయణరెడ్డి. ఘంటసాల వారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగభావమేది. ఘంటసాల వారి గాన ధారలోన తడియనట్టి తెలుగుటెడదయేది అన్నాడు దాశరథి. ఎవరేమన్నా.. ఘంటసాల తెలుగుతల్లికి కంఠాభరణం.వెంకటేస్వరం.
ఆయన పాట వినని తెలుగువాడుండడు. ఆయన తెలుగు వారి స్థిరాస్తి. ఇవాళ ఆయన జయంతి. అంతే కాదు ఇవాళ్టి నుంచి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఘంటసాల మాస్టార్ గురించి, ఆయన స్వర మాధుర్యం గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇప్పటికే చాలా మంది పండితులు ఘంటసాలకు అక్షర స్వరాభిషేకం చేశారు. అయితే ఘంటసాల గాయకులుగా ఎంతటి లబ్ధ ప్రతిష్టులో సంగీత దర్శకుడిగా కూడా అంతటి ప్రతిభావంతులు. సంగీత దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాల గురించి కొంత తెలుసుకుందాం!
ఏ తల్లి మొదటి కబళం ఆయన జోలెలో వేసిందో, ఆమె వాత్సల్య పూరితమైన భిక్ష ఆయనకు అష్టైశ్వరాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించిందో కానీ తెలుగువారికి మాత్రం కమనీయ స్వరాన్ని ప్రసాదించింది. అంతకు మించిన స్వరకల్పన పాండిత్యాన్నీ ఇచ్చింది. గాయకుడిగా ఆ పాటల టంకసాల ఎంత ప్రసిద్ధుడో ఓ స్వరకర్తగా కూడా అంతే సుప్రసిద్ధుడు. నేపథ్యగాయకుడిగా ఘంటసాల సినీరంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆయనకు పెద్దగా పోటీ లేదు. అప్పుడున్నవాళ్లు కొద్ది మందే! ఎం.ఎస్.రామారావు, మాధవపెద్ది, పిఠాపురం..వగైరా వగైరా.. పైగా అప్పుడప్పుడే ప్లే బ్యాక్ మొదలైంది. కానీ సంగీత దర్శకుడిగా మాత్రం చాలా పోటీ వుంది. సాలూరి రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, పెండ్యాల నాగేశ్వరరావు, గాలి పెంచలనరసింహరావు, ఓగిరాల రామచంద్రరావు, సుసర్ల దక్షిణామూర్తి.. వీరంతా స్వర సామ్రాట్టులు. వీరితో నెగ్గుకురావడం అంత సులభమైన పని కాదు.. కానీ ఘంటసాల తట్టుకుని నిలబడగలిగారు. లేకపోతే అన్నేసి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగలిగేవారా? శ్రోతలను ఆకట్టుకోగలిగేవారా? శాస్త్రీయ సంగీతంలో అపారమైన ప్రతిభ కలిగినా.. ఆ పాండిత్యాన్ని తన పాటల్లో ఏనాడు జొప్పించలేదు. ప్రజలకు కావాల్సిన సంగీతమే అందించారు. ఆ మాటకొస్తే గాయకుడే సంగీత దర్శకుడైతే పాటకు సరికొత్త అందాలు సమకూరుతాయి. ఓ షావుకారు, ఓ పాతాళభైరవి, ఓ చిరంజీవులు, ఓ రహస్యం.. ఎన్నన్ని చెప్పగలం. శతాధిక చిత్రాల్లో ఏ ఆణిముత్యాన్ని ఏరగలం? ఏ బాణిముత్యాన్ని పరిచయం చేయగలం? ఎన్ని రాగాలను పరిచయం చేశారు? ఎన్ని రాగమాలికలను సృష్టించారు? ఎన్ని ప్రయోగాలు చేశారు? ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం?
సంగీత దర్శకుడిగా ఘంటసాలకు లక్ష్మమ్మే మొట్టమొదటి సినిమా అయినా.. కీలుగుర్రం తొలుత విడుదలైంది. ఇందులో కాదుసుమా కలకాదు సుమా పాట అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూపించింది. ప్రజలు విని సంతోషించడంతో పాటు తిరిగి పాడుకొని పరవశించేలా వుండటం సినిమా పాటకు కావాల్సిన ప్రధానమైన యోగ్యత. ప్రజాదరణ పొంది పది కాలాల పాటు నిలబడగల్గడమే మంచి సినిమా పాటకు ప్రమాణమని ఘంటసాల అంటుండేవారు. కీలుగుర్రంలోనే ఎంత కృపామతివే అన్న పాట వుంది. ఎంతో చక్కని కంపోజింగ్. బృందావన్ సారంగ్, మిశ్రయమన్ రాగాలతో స్వరపరిచిన పాటలో ఘంటసాల మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా నూతనముగా ఈ లేత మారుతము అన్న వాక్యం దగ్గర ఆర్కెష్ర్టయిజేషన్ గమనిస్తే అక్కడ వినిపించే క్లారినెట్ వినిపిస్తుంది. ఇదే ఘంటసాల సంతకం. తర్వాత వచ్చిన షావుకారులో నూరు అణాల తెలుగు సంగీతాన్ని అందించారు. పాటలన్నీ చక్కటి మెలోడితో ఎంతో హాయిగా వుంటాయి. ఇంకో ముఖ్యవిశేషమేమిటంటే, సినిమాలో హరికథ వుంటుంది. ఇది జరుగుతున్నప్పుడు వచ్చే సంభాషణలు ఎంతో స్పష్టంగా వినిపిస్తాయి. అంతటి అద్భుతమైన ప్రక్రియను ఆ రోజుల్లోనే ఘంటసాల సాధించారు.
ఇక పాతాళభైరవిలో అయితే వన్నె తరగని సంగీతాన్ని అందించారు. ఈ సినిమాతోనే హేమండ్ ఆర్గాన్ వాయిద్యాన్ని ఘంటసాల ప్రవేశపెట్టారు. 1948లో ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ మద్రాస్‌కు వచ్చి అనేక కచేరీలు చేశారు. ఆయన గాత్ర విన్యాసానికి ముగ్ధుడైన ఘంటసాల ఆయన్ను తన ఇంటికి పిలిపించుకుని ఓ రెండు రోజులు ఆతిథ్యమించి హిందుస్తానీ రాగాల ఆకలింపు చేసుకున్నారు. పాతాళభైరవి పాటల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతఘాటు ప్రేమయో పాటను. హిందుస్తానీ సంప్రదాయంలోని రాగేశ్రీ రాగంలో స్వరపరిచారు మాస్టారు. ఈ సినిమాలో హిందీలో నౌషాద్ చేసిన మూడు పాటలకు ఘంటసాల ప్రభావితురయ్యారని అనిపిస్తుంది. అలాగే వినిపిస్తుంది. ఎంతఘాటు ప్రేయమో పాటకు అన్‌మోల్ ఘడీలోని ఆవాజ్‌దే కహా హై ప్రేరణ అనిపిస్తుంది. ఈ పాటకు అందుకేనేమో మాస్టారు హిందుస్తానీ సంప్రదాయంలోని రాగేశ్రీ రాగాన్ని వాడుకున్నారు. కలవరమాయె పాట వింటుంటే దిల్లగీలోని తూ మేరా చాంద్ పెదాలపై అప్రయత్నంగానే నర్తిస్తుంది! అలాగే తీయని ఊహలు పట వింటుంటే రతన్ సినిమాలోని రున్ ఝున్ బర్సే బాదర్‌వా పాట గుర్తుకువస్తుంది. అలాగని ఆయా పాటలను యథాతథంగా దింపారని కాదు.. కేవలం ఇన్‌స్పిరేషన్ మాత్రమే! ఆ మాటకొస్తే ఒరిజినల్ సాంగ్స్ కంటే ఘంటసాల పాటలే బాగుంటాయి.
1963లో విడుదలైన లవకుశను ఎవరైనా మర్చిపోతారా? సంగీత దర్శకునిగా ఘంటసాల సినీజీవితంలో లవకుశ ఒక కలికితురాయి. ఈ సినిమాలో ప్రతి పాట, పద్యం మహాద్భుతం . ఈ సినిమాలో, పి. లీల, పి. సుశీలలతో పాడించిన శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట శివరంజనిలో స్వరపరిచారు. పాట మొత్తంలో మామూలుగా శివరంజని రాగంలో వాడని అన్య స్వరాలు ఉపయోగించటం వల్ల ఈ పాటని మిశ్ర-శివరంజని అని అనుకోవచ్చు. సాధారణంగా విషాద, కరుణ రసాలకు శివరంజని రాగాన్ని వాడుతుంటారు. ఘంటసాల బందిపోటు సినిమాలో వగలరాణివి నీవె పాటకు శివరంజని రాగాన్ని గమ్మత్తుగా వాడారు. శివరంజని రాగంలో లేని ని- స్వరాన్ని అందంగా ఈ పాటలో ఉపయోగించారు ఘంటసాల. ఘంటసాల ప్రతిభావ్యుత్పత్తులకు నిదర్శనం రహస్యం సినిమా. సంగత దర్శకుడిగా ఘంటసాల విజృంభించిన సినిమా అది. ఎన్నో ప్రయోగాలు చేశారు అందులో. శంకరాభరణం, హంసధ్వని, మధ్యమావతి, కాంభోజి, అఠాణా, కేదారగౌళ, వసంత, రీతిగౌళ, శహన, సరస్వతి, హిందోళం, నాదనామక్రియ, కన్నడ, సామ, సౌరాష్ట్ర వంటి ఎన్నో రాగాలను ఆయన ఉపయోగించారు. ఒక సినీ నిర్మాత ఇళయరాజాను తను తీసే సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ కావాలని కోరాడట! దానికి ఇళయరాజా ఓ నవ్వు నవ్వి… ఆ ప్రతిభ ఒక్క ఘంటసాల గారికే వుందండి.. మేముంత వారి ముందు అన్నాడట విన్రమంగా.. ఇది చాలదూ ఘంటసాల ప్రతిభావ్యుత్పల్తులేపాటివో చెప్పడానికి.
పెళ్లి చేసి చూడు సినిమా టైటిల్స్‌లో ఘంటసాల పేరుకు బదులుగా ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారే చిత్రానికి నాదబ్రహ్మలండి అని రాసారు పింగళి నాగేంద్రరావు. అప్పుడాయన ఏ ఉద్దేశంతో రాసారో కానీ.. అది సత్యమైంది. ఇందులో ఏడు కొండల వాడా వెంకటారమణ అనే పాట వుంది. తెలుగులో చక్రవాకం ఆధారంగా చాలా పాటలే వచ్చాయి. అయితే ఏ పాట కూడా ఈ స్థాయిని చేరుకోలేదంటే అది ఘంటసాల ప్రతిభే. కళ్యాణి, భీంప్లాస్, రాగేశ్వరి, భాగేశ్వరి, మాండ్, సింధుభైరవి, హంసానంది, హంసధ్వని, హిందోళం.. ఇవన్నీ ఘంటసాలకు ఇష్టమైన రాగాలు. ఘంటసాల స్వరపరచిన పాటల్లో చాలా మట్టుకు ఈ రాగాలే వినిపిస్తాయి. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయన సరదా.
కన్యాశుల్కము సినిమానే తీసుకుంటే…గాయకుడిగా ఘంటసాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. గిరీశం పాత్ర స్వభావాన్ని పూర్తగా ఆకళింపు చేసుకున్నారు కాబట్టే చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటను అంత భావస్ఫురకంగా పాడగలిగారు. మాయాబజార్ ఘంటసాలను సంగీతదర్శకుడిగా శిఖరాగ్రాన నిలబెట్టింది. ఈ సినిమాకు ముందు రాజేశ్వరరావుగారిని అనుకున్నా.. కారణాంతరాల వల్ల ఆ అవకాశం ఘంటసాలకు దక్కింది. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు. అహనా పెళ్లియంట పాట ఒక ఎత్తు.. సుశీల పాడిన ఈ పాటలో ఘంటసాల గొంతు కూడా కంగున మోగుతుంది. శంకరాభరణం, హరికాంభోజి రాగాల మిశ్రమంతో స్వరపరిచిన ఈ పాట గాయకురాలిగా సుశీలకు ఓ మైలురాయిగా నిల్చిపోయింది. కళ్యాణి, భీంప్లాస్, రాగేశ్వరి, భాగేశ్వరి, మాండ్, సింధుభైరవి, హంసానంది, హంసధ్వని, హిందోళం.. ఇవన్నీ ఘంటసాలకు ఇష్టమైన రాగాలు. ఘంటసాల స్వరపరచిన పాటల్లో చాలా మట్టుకు ఈ రాగాలే వినిపిస్తాయి. ఏ రాగంలో పాడామన్నది ప్రధానం కాదు.. భావాన్ని పలికించడానికి రాగాన్ని, స్థాయిని, మూర్చనను ఎలా వాడుకున్నారన్నదే ప్రధానం. ఈ విద్య ఘంటసాలకు మాబాగా తెలుసు. సంగీత దర్శకుడిగా ఆయన కనబరచిన ప్రతిభ గాయకుడిగా ఆయన సాధించిన విజయం కారణంగా కాస్త మరుగున పడివుండవచ్చు. జనరంజకం కోసం రాగాలను మిశ్రమం చేయడంలో తప్పులేదనుకునేవారు మాస్టారు. చెవులకు ఇంపుగా.. వినసొంపుగా వుండాలన్నదే ఆయన అభిమతం. హిందుస్తానీ సంప్రదాయంలో ఈ సౌలభ్యం ఎక్కువ. అందుకే హిందుస్తానీ రాగాలను వాడుకున్నప్పుడు ఆయన పాటలను లలితంగా..మధురంగా కంపోజ్ చేశారు. పెళ్లి చేసి చూడులో ఎవరో ఎవరో పాటకు చారుకేశి వంటి కర్ణాటక రాగాన్ని అతి సమర్థంగా వాడిన ఆయనే లలితసంగీతానికి పనికిరావనుకునే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను అద్భుతంగా వాడారు. మధుకోన్స్ రాగంలో స్వరపర్చిన ఊహలు గుసగుసలాడే అన్న పాట విన్నాక ఘంటసాలకు హిందుస్తానీ సంగీతంతో పరిచయం తక్కువని ఎలా అనుకోగలం? ఘంటసాల ఓ వంద సినిమాలకు పైగా సంగీతాన్ని అందించారు. సినిమాలు విజయవంతం అయ్యాయో లేదో కానీ పాటలు మాత్రం జనరంజకాలు అయ్యాయి. దటీజ్ ఘంటసాల.
Read Also… Tirupati: హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు