
ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి.సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, మహారాజా హాస్టల్, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలుతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందజేస్తున్నాయి. అయితే ఇందులో ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ వ్యూస్ తో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లో దూసుకపోతోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. ఇక ఇందులో హీరో పాత్ర పోషించిన రాజ్ బి శెట్టి తెలుగు ఆడియెన్స్ కు బాగా సుపరిచితుడే. గతంలో అతను నటించిన టోబి, సు ఫ్రమ్ సో సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మానసిక సమస్యలతో బాధపడే శివ ఒక పోలీస్ అధికారి అసలు నేరాలే జరగని రక్కసపుర అనే మారుమూల గ్రామానికి బదిలీ పై వస్తాడు. అయితే, అతను ఆ గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే, అక్కడ వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. పెళ్లికూతురు మాదిరిగా అలంకరించిన యువతుల మృతదేహాలు కనిపిస్తాయి. అంతేకాదు… వారి ముఖాలు కాలిపోయి ఉండటంతో అందరూ తెగ భయపడిపోతారు. గ్రామస్తులు మాత్రం ఈ సీరియల్ హత్యలకు కారణం ఒక దెయ్యమేనని బలంగా నమ్ముతారు. కానీ శివ మాత్రం ఈ దెయ్యాల కథను నమ్మడు. విచారణలో ఎంతో మందిని విచారిస్తాడు. చివరికి సిద్ధయ్య అనే వ్యక్తే ఈ వరుస హత్యలు చేస్తున్నాడని తేలుతుంది. అయితే అనూహ్యంగా సిద్ధయ్య కూడా దారుణ హత్యకు గురువతాడు. మరి రక్కసపురలో జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి ? నిజంగానే ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నాయా? శివ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రవి సారంగ దర్శకత్వంలో, రవి వర్మ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా పేరు ‘రక్కసపురదోళ్’ (Rakkasapuradhol). ఈ చిత్రంలో నటుడు రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే స్వాతిష్ట, అర్చన కొట్టిగె, అనిరుధ్ భట్, బి. సురేఖ, గోపాలకృష్ణ దేశ్ పాండే, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఒరిజినల్ కన్నడ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. ఇప్పుడే చూడాలనుకునేవారు మాత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.