NTR Birth Anniversary : గురువు కె.వి.రెడ్డి పట్ల ఔదార్యం చూపిన ఎన్టీఆర్‌..

| Edited By: Anil kumar poka

May 28, 2021 | 5:15 PM

దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి చివరి రోజుల్లో జరిగిన సంఘటన. అప్పటికీ విజయా సంస్థ నుంచి వైదొలిగిన రోజులు. బయట చిత్రాలు లేవు. సొంతంగా తీసిన చిత్రాలు నష్టాన్నే తెచ్చాయి. విజయాసంస్థ నుంచి బయటకు రాలేదు.

NTR Birth Anniversary : గురువు కె.వి.రెడ్డి పట్ల ఔదార్యం చూపిన ఎన్టీఆర్‌..
Ntr
Follow us on

దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి చివరి రోజుల్లో జరిగిన సంఘటన. అప్పటికీ విజయా సంస్థ నుంచి వైదొలిగిన రోజులు. బయట చిత్రాలు లేవు. సొంతంగా తీసిన చిత్రాలు నష్టాన్నే తెచ్చాయి. విజయాసంస్థ నుంచి బయటకు రాలేదు. నాగిరెడ్డి-చక్రపాణిలే వెళ్లగొట్టారు.. అందుకే కారణం కేవీ అంటే చిన్నపాటి పగ! షావుకారు సినిమా తీసి సర్వ కోల్పోయిన విజయాసంస్థ కేవీ తీసిన పాతాళభైరవి కారణంగా నిలదొక్కుకోగలిగింది. ఆ సినిమా తర్వాత విజయాకే మరో సినిమా తీసిపెట్టమన్నారు నాగిరెడ్డి-చక్రపాణి. వాహినీకి మాట ఇచ్చాను, వారికే తీస్తానని కేవీ చెప్పడంతో నాగిరెడ్డి-చక్రపాణి ఇగో దెబ్బతింది..తర్వాత విజయవారికి మాయాబజార్‌ చేశారు కేవీ. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఆ తర్వాత నుంచి కేవీ మాటే చెల్లుబాటు కావడం మొదలయ్యింది. ఎంతగా అంటే విజయవారు తీసిన జగదేకవీరుని కథ సినిమాకు దర్శక నిర్మాతగా కేవీరెడ్డి పేరు పడేంతగా! ఆ తర్వాత విజయవారికి సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరిశంకరుల కథ సినిమాలు తీశారు కేవీ. రెండూ ఫ్లాప్‌ అయ్యాయి.. సమయం కోసం కాచుకూర్చున్న నాగిరెడ్డి-చక్రపాణి ద్వయం కేవీపై పగ తీర్చుకున్నారు. కేవీతో సహా విజయా సంస్థలో నెలవారీ జీతాలకు పని చేస్తున్నవారందరినీ ఇంటికి పంపించేశారు. ఆ జాబితాలో పాపం పింగళి, గోఖలే, కళాధర్‌లు కూడా ఉన్నారు.. కేవీకి ఇచ్చిన కారును కూడా వెనక్కి తీసుకున్నారు. ఇది పరిశ్రమలో చాలా మందిని కదిలించింది. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు?

తనకు స్టార్‌డమ్‌ను కలిగించిన గురువు కేవీరెడ్డికి అలా జరగడం ఎన్టీఆర్‌ను బాధించింది. వెంటనే కేవీ ఇంటికెళ్లారు.. పరామర్శలు అయ్యాయి.. ఎన్టీఆర్‌ ఏదో చెప్పాలనుకుంటున్నారు.. కేవీ ఏదో అడగాలనుకుంటున్నారు… ఇద్దిరి మధ్య కాసేపు నిశ్శబ్దం. అప్పటికే ఇంజనీరింగ్‌ చేసిన కేవీ కుమారుడికి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అర్జెంటుగా లక్ష రూపాయలు అవసరమొచ్చాయి. తెలిసిన వారందరినీ అడిగి చూశారు. అప్పుకోసం ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఆ రోజుల్లో లక్షంటే మాటలా..సరే ఎన్టీఆర్‌ ఇంటికొచ్చారు కదా అడిగి చూద్దామనుకున్నారు. విషయం చెప్పారు. అప్పుగా ఆ మొత్తం ఇవ్వమని అభ్యర్థించారు. నా సొంతానికి ఓ సినిమా తీసిపెట్టండి.. మీ రచయిత పింగళి నాగేంద్రరావు రాసిన రెండు స్క్రిప్టులు నా దగ్గర ఉన్నాయి. ఒకటి చాణక్య శపథం (తర్వాతి కాలంలో దీన్నే చాణక్య చంద్రగుప్తగా తీశారు ఎన్టీఆర్‌), రెండోది శ్రీకృష్ణ సత్య. రెండింటిలో మీ ఇష్టం వచ్చింది తీసి పెట్టండి అని అడిగారు.. లక్ష రూపాయలు అప్పుగా కాకుండా ఆయన పారితోషికంలో అడ్వాన్సుగా ఆ మొత్తం ఇస్తున్నట్లు అగ్రిమెంట్‌ రాయించుకుని సొమ్మునిచ్చారు. ఆ రోజుల్లో రామారావు పారితోషికమే అంతుండేది. అలాంటిది అడ్వాన్సుగా లక్ష రూపాయలు దర్శకుడికి ఇవ్వడమనేది ఔదార్యమే. కెవికి ఆశ్చర్యంతో పాటు ఆనందమూ వేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. సాధారణంగా రామారావు నిర్మాణ సంస్థలో పర్మనెంట్‌ టెక్నిషియన్లు వుండేవారు. సముద్రాల, రహమాన్‌, టివిరాజు… ఇలాగన్నమాట. కానీ శ్రీకృష్ణ సత్యకు మాత్రం కెవి రెడ్డికి నచ్చిన టీమ్‌తోనే రామారావు సినిమా తీశారు. దటీజ్‌ ఎన్టీయార్‌. రామారావు తనకు కొండంత బలమూ ధైర్యమూ ఇచ్చాడు. ఓ మంచి చిత్రం తీసి హాయిగా సొంతూరు తాడిపత్రికి వెళ్లిపోతాను అని తన సన్నిహితులతో చెప్పుకున్నారట కె.వి.రెడ్డి.

అలాగే నటుడు నాగభూషణమంటే ఎన్టీయార్‌కు ప్రత్యేక అభిమానముండేది. తన సొంత సినిమాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్లామా, కోడలు దిద్దిన కాపురం… ఇలా అన్నింటిలోనూ ఆయనకు మంచి వేషాలు ఇచ్చారు. నాగభూషణానికి స్టార్‌ హోదా వచ్చాక హీరో వేషం వేయాలనే కోరిక కలిగింది. దిడ్డి శ్రీహరిరావుతో కలిసి నాటకాల రాయుడు సినిమా తీశారు. హిందీలో భగవాన్‌తో వచ్చిన అల్‌బేలా సినిమా దీనికి ఆధారం. సినిమా పోయింది. నాగభూషణం నష్టాలపాలయ్యాడు. ఆ సమయంలోనే రామారావు ఒకే కుటుంబం సినిమా తీయించాడు. సినిమా విజయంవంతం కావడంతో నాగభూషణం కోలుకోగలిగాడు. ఇండస్ట్రీలో ఒకరా ఇద్దరా… ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి రామారావు. మద్యం మత్తులో కమెడియన్‌ కస్తూరి శివరావు సినిమాలన్నీ పొగుట్టుకుంటే పిలిచి మరీ సినిమాలిప్పించాడు ఎన్టీఆర్‌..