Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

శోభన్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా గురించి మీకు తెలుసా.. ? 80వ చిత్రంగా విడుదలైన ఇది, ఆయన్ని సోలో హీరోగా నిలబెట్టింది. తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయం, విభిన్న నటనకు తొలి గుర్తింపు తెచ్చింది. బ్లాక్ అండ్ వైట్‌లోనూ ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులు సృష్టించి, శోభన్ బాబు సినీ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది.

Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..
Taasildaar Gari Ammayi Movie

Updated on: Nov 17, 2026 | 9:19 PM

నటభూషణ శోభన్ బాబు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి అప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. చిన్న చిన్న వేషాల నుంచి హీరో పాత్రల వరకు 70కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ, సోలో హీరోగా నిలదొక్కుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తూనే, సమకాలీన హీరో కృష్ణతోనూ పలు చిత్రాల్లో పాలుపంచుకున్నారు. వీరాభిమన్యు, మనుషులు మారాలి, కళ్యాణ మండపం వంటి హిట్స్ ఉన్నా, తనకంటూ ఒక పెద్ద బ్రేక్ ఇచ్చి నిలబెట్టే సినిమా కోసం శోభన్ బాబు ఆశగా ఎదురుచూశారు. ఆయన నిరీక్షణకు సమాధానంగా, 80వ చిత్రంగా తాసిల్దారుగారి అమ్మాయి 1971 నవంబర్ 12న విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో శోభన్ బాబు సోలో హీరోగా స్థిరపడ్డారు. అక్కడి నుంచి వరుస విజయాలతో ముందుకు సాగుతూ, మహిళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు.

శోభన్ బాబు తన కెరీర్‌లో ద్విపాత్రాభినయం అనేకసార్లు చేసినా, ఆయన నటనకు, విభిన్న పాత్రపోషణకు తొలి గుర్తింపు తెచ్చిన చిత్రం తాసిల్దారుగారి అమ్మాయి. ఈ చిత్రంలో పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా, యువకుడైన వాసుగా రెండు విభిన్న వయసుల, కీలకమైన కథానాయక పాత్రలను పోషించి మెప్పించారు. మనిషి తీరులో కాకుండా, సంభాషణ చెప్పడంలో, నడకలో వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఆయన ఎంతో శ్రమించారు. తండ్రీకొడుకుల పాత్రలు ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి మాట్లాడుకునే సన్నివేశాలలో శోభన్ బాబు చూపిన శ్రద్ధ అద్భుతం. ఈ చిత్రాన్ని సత్యచిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి కే.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించారు. విధివిన్యాసాలు నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు కే.ఎస్. ప్రకాశరావు స్క్రీన్‌ప్లే రాయగా, ఎన్.ఆర్. నంది మాటలు రాశారు. కే.వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించగా, ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాఘవేంద్రరావు, సత్యచిత్ర సంస్థ నిర్మించిన అడవి రాముడు సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారడం విశేషం.

శోభన్ బాబుకు నటి కళాభారతి జమున పట్ల ఎంతో అభిమానం ఉండేది. కళాశాల రోజుల నుంచీ ఆమెకు ఉత్తరాలు రాసేవారు. 1959లో ఇల్లరికం షూటింగ్‌లో జమునను చూసి, తాను నటుడయ్యాక ఆమెతో నటించాలని కలలు కన్నారు. ఆ కల తాసిల్దారుగారి అమ్మాయి చిత్రంతో నెరవేరింది. కలర్ చిత్రాల నిర్మాణం జోరందుకుంటున్న సమయంలో తాసిల్దారుగారి అమ్మాయి బ్లాక్ అండ్ వైట్‌లో తీయడం మరో ప్రత్యేకత. ఇదే సమయంలో కే.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలోనే ఏఎన్నార్ తో ప్రేమనగర్ చిత్రం కూడా నిర్మించబడింది. రెండూ నవల ఆధారిత చిత్రాలే, ఒకరే దర్శకుడు కావడం విశేషం. ప్రేమనగర్ భారీ బడ్జెట్‌తో, రంగుల హంగులతో ఘన విజయం సాధించగా, తాసిల్దారుగారి అమ్మాయి కొన్ని హిట్‌ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1971 నవంబర్ 12న 29 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం, ఏడు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వైజాగ్‌లోని నవరంగ్ నాన్-ఏసీ థియేటర్‌లో 100 రోజులకు మూడు లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. విజయవాడ విజయా టాకీస్, గుంటూరు లిబర్టీ, రాజమండ్రి వీరభద్ర థియేటర్స్‌లో 105 రోజులు ఆడింది. 1972 ఫిబ్రవరి 19న రాజమండ్రిలో జరిగిన 100 రోజుల వేడుకకు అక్కినేని అధ్యక్షత వహించి, శోభన్ బాబును “He is a good actor, future hope of the film industry” అని ప్రశంసించారు. ఆయన జోస్యం నిజమై శోభన్ బాబు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us