UP Elections: పూర్వాంచల్‌లో బీజేపీ పట్టు నిలుస్తుందా? ఎస్పీ గెలుపు ఆశలపై బీఎస్పీ నీళ్లు చల్లుతుందా?

| Edited By: Balaraju Goud

Feb 26, 2022 | 1:10 PM

ఉత్తరప్రదేశ్‌లో రేపు జరగబోతున్న అయిదో విడత పోలింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

UP Elections: పూర్వాంచల్‌లో బీజేపీ పట్టు నిలుస్తుందా? ఎస్పీ గెలుపు ఆశలపై బీఎస్పీ నీళ్లు చల్లుతుందా?
Up Elections
Follow us on

Uttar Pradesh Assembly Election 2022: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడికి దిగిన తర్వాత దేశవాళి రాజకీయాలపై ప్రస్తుతానికి ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకుండా ఉంది. అందరూ ఆ యుద్ధం గురించే ముచ్చటించుకుంటున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లు ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో రేపు జరగబోతున్న అయిదో విడత పోలింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి. అధికార బీజేపీ(BJP), సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) మధ్య పోరు హోరాహోరీగా సాగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రేపు జరగబోయే పూర్వంచల్‌లో ఎవరిది పై చేయి కావచ్చనే ఉత్కంఠ మొదలయ్యింది.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలీ, సుల్తాన్‌పుర్‌, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబీ, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకీ, అయోధ్య, బహ్రాయిచ్‌, శ్రావస్తీ, గోండా జిల్లాలలోని 61 నియోజకవర్గాలు పోలింగ్‌కు సిద్ధమవుతున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 47 స్థానాలను గెల్చుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి అయిదు, అప్నాదళ్‌కు మూడు, బహుజన్‌సమాజ్‌ పార్టీకి మూడు స్థానాలు లభించాయి. ఇండిపెండెంట్లు రెండు చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ ఓ చోట విజయం సాధించింది. క్రితంసారి ఎన్నికల్లోలాగే ఈసారి కూడా మెజారటీ సీట్లు సాధించాలన్నది బీజేపీ ఆకాంక్ష. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతే తమను గెలుపిస్తుందన్న నమ్మకంతో సమాజ్‌వాదీ పార్టీ ఉంది.

అయిదో దశ పోలింగ్‌లో తమకే ఎక్కువ స్థానాలు లభిస్తాయని బీజేపీ బలంగా నమ్మడానికి కారణం అయోధ్య ప్రాంతంలో ఎన్నికలు జరగడమే. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే అయోధ్య రామమందిర నినాదంతో! నిజానికి 1990లలో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రాగలిగిందంటే అయోధ్యనే కారణం. అందుకే రామాలయం ఇప్పుడు కూడా బీజేపీకి అంత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. పైగా ఇప్పుడు రామమందిరం నిర్మాణం కూడా మొదలయ్యింది. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చే అంశం. ఇప్పటికీ ప్రచారంలో బీజేపీ పదే పదే రామమందిరాన్ని ప్రస్తావిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో సమాజ్‌వాదీ పార్టీ కాసింత ముందంజలో ఉందని వార్తలు వస్తున్నాయి. నాలుగో విడతలో బీజేపీకి కొంచెం ఆధిక్యత వచ్చిందనుకుంటున్నారు. ఇవన్నీ గమనించిన బీజేపీ అవధ్‌, పూర్వాంచల్‌ ప్రాంతాలలో పూర్తి ఆధిక్యాన్ని కనబర్చాలని అనుకుంటోంది. తద్వారా ఇప్పటి వరకు కలిగిన నష్టాన్ని పూడ్చాలనుకుంటోంది. ప్రజలకు తగు వాగ్దానాలు చేస్తోంది.

సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పుడు కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకు కారణం ఇప్పటి జరిగిన పోలింగ్‌ పార్టీకి అనుకూలంగా ఉండటమే. అయిదో విడత పోలింగ్‌లోనూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్న గట్టి నమ్మకంతో ఉంది. ప్రభుత్వంపై ప్రజలలో చాలా వ్యతిరేకత ఉందని, అదే తమకు ఓట్లు తీసుకొస్తాయని అంటోంది. ఇంతకు ముందు బీజేపీకి కౌంటర్‌గా ఎస్పీ కూడా అయోధ్య అంశాన్ని తీసుకొచ్చేది. ఇప్పుడా పని చేయడం లేదు. 2012 ఎన్నికల్లోలాగే ఈసారి తమకు అత్యధిక స్థానాలు వస్తాయని ఎస్పీ అంచనా వేసుకుంటోంది. ఆ ఎన్నికల్లో ఎస్పీ మొత్తం 61 స్థానాలలో 39 చోట్ల విజయం సాధించింది. ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నాయకత్వంలోని సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీకి ఇక్కడ అంతో ఇంతో పట్టుంది. ఇప్పుడా పార్టీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఇది తమకు కలిసి వస్తుందని ఎస్పీ చెబుతోంది. బీజేపీతో పోటీగా ఎస్పీ కూడా ఓటర్లకు కొన్ని హామీలు ఇస్తోంది.

పశువుల నుంచి పంటలను రక్షించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అయిదు లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తామని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చెబుతున్నారు. మరోవైపు బహుజన్‌ సమాజ్‌ పార్టీ క్రితం సారి మూడు సీట్లనైతే గెల్చుకుంది కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే ఇక్కడ బీఎస్పీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది. ఇది ఏ పార్టీకి నష్టం తెస్తుందో తెలియడం లేదు. ఒకవేళ విపక్షం ఓట్లను చీలిస్తే మాత్రం బీజేపీకి అడ్వాంటేజ్‌. ఎస్పీ ఎక్కడైతే మైనారిటీ అభ్యర్థులను బరిలో దింపిందో అక్కడ బీఎస్పీ కూడా అదే సామాజికవర్గ అభ్యర్థులను బరిలో దింపడం ఆసక్తిగా మారింది. ఇది ఎస్పీకి నష్టం కలిగించే అంశమే! 2007లో బ్రాహ్మణులు బీఎస్పీకి మద్దతు పలికారు. 2012 నుంచి బీజేపీకి సపోర్ట్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. మళ్లీ బ్రాహ్మణులను తమ వైపు తిప్పుకునేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. ఒక్క బ్రాహ్మణులే కాకుండా జాతవ్‌, జాతవేతర దళితుల మద్దతును తిరిగి పొందడానికి యత్నిస్తోంది.

Read Also…

వారిని స్వస్థలాలకు తరలించే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. నితీశ్ కుమార్ ప్రకటన