బాలీవుడ్ బ్యూటీ జరాఖాన్‌కి అత్యాచార బెదిరింపులు.. ఆరా తీస్తే హైదరాబాద్‌కు చెందిన యువతి పేరుతో..

|

Dec 06, 2020 | 2:43 PM

బాలీవుడ్ నటి, సింగర్ జరా ఖాన్‌ను అత్యాచారం చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బెంబేలెత్తిపోయిన జరా ఖాన్..

బాలీవుడ్ బ్యూటీ జరాఖాన్‌కి అత్యాచార బెదిరింపులు.. ఆరా తీస్తే హైదరాబాద్‌కు చెందిన యువతి పేరుతో..
Follow us on

బాలీవుడ్ నటి, సింగర్ జరా ఖాన్‌ను అత్యాచారం చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బెంబేలెత్తిపోయిన జరా ఖాన్.. ముంబై పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారం చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని ఒషివర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3వ తేదీ మధ్య తన ఇన్‌స్టాగ్రమ్‌కు ఈ రకమైన సందేశాలు వచ్చాయని పోలీసులకు చేసిన ఫిర్యాదులో జరా ఖాన్ పేర్కొంది.

ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు. దీంతో ముంబై పోలీసులు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం తీసుకున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రేస్ చేయగా, ఎంబీఎ చదువుతున్న 23 ఏళ్ల నూర్ సరవర్‌‌గా గుర్తించారు. అయితే ఆమె మెంటల్ కండీషన్ సరిగా లేదని, ఆ సందేశాలు ఆమె ఐడీతో వేరేవారు పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అసలు నిందితుడి కోసం వేట సాగిస్తున్నామని, ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం సరవర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా, జరాఖాన్ అలనాటి ప్రముఖ నటి సల్మా ఆఘా కూతురు. జరాఖాన్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు పాటలు కూడా పాడింది. అలాగే ఔరంగాజేబ్, దేశీ కట్టి వంటి సినిమాల్లో నటించింది కూడా.