’బిజినెస్ మెన్‘ అంటూ బిల్డప్..రూ. కోట్లతో పరార్!

|

Aug 27, 2020 | 6:48 PM

ఒంటినిండా బంగారం..ఇంటినిండా పనివాళ్లు..కార్లు, టూవీలర్లు, ఉండేందుకు అద్దె తీసుకున్న రెండు ఇండ్లు..బిల్డప్ చూస్తే..ఎవరికైనా అబ్బా ఎంత ధనవంతుడో, అనిపించక మానదు..కానీ, నెలరోజులకే స్థానికులను నిలువునా ముంచేశాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు కొట్టేసి పరారయ్యాడు.

’బిజినెస్ మెన్‘ అంటూ బిల్డప్..రూ. కోట్లతో పరార్!
Follow us on

ఒంటినిండా బంగారం..ఇంటినిండా పనివాళ్లు..కార్లు, టూవీలర్లు, ఉండేందుకు అద్దె తీసుకున్న రెండు ఇండ్లు..బిల్డప్ చూస్తే..ఎవరికైనా అబ్బా ఎంత ధనవంతుడో, అనిపించక మానదు..కానీ, నెలరోజులకే స్థానికులను నిలువునా ముంచేశాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు కొట్టేసి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు…

చిత్తూరు జిల్లా కలికిరిలో వ్యాపారి పేరుతో ఓ మోసగాడు స్థానికులకు కుచ్చుటోపి పెట్టాడు. మనోహర్ రెడ్డి అనే వ్యక్తి నెల రోజుల క్రితం స్థానికంగా ఓ షాపు అద్దెకు తీసుకొని హోల్‌ సేల్ ధరలకే నిత్యవసర సరుకులు, సిగరెట్లు అమ్ముతానంటూ కలికిరి క్రాస్‌రోడ్డులో వ్యాపారం మొదలుపెట్టాడు. చేతి వేళ్లకు ఉంగరాలు, మెడలో చైన్లు వేసుకొని బడా వ్యాపారి అనుకునేలా స్థానికుల ముందు బిల్డప్ ఇచ్చాడు. షాపులో 12 మంది పనివాళ్ళను చూసిన కలికిరి వాసులు మనోహర్‌రెడ్డి నిజంగా పెద్ద వ్యాపారి అని నమ్మారు. ఊరు పేరు తెలియని వ్యక్తికి రెండు కోట్ల రూపాయల వరకు సమర్పించుకున్నారు.

స్థానికులతో పాటు షాపు అద్దెకిచ్చిన యజమాని కూడా ఈ మోసగాడి ఉచ్చులో పడి 10లక్షలు ఇచ్చుకున్నాడు. ఇది చాలదంటూ లక్ష రూపాయలకు వారానికి వెయ్యి రూపాయలు వడ్డీ ఇస్తానంటూ ఇంకొందర్ని నమ్మించాడు. వడ్డీకి ఆశపడ్డ స్థానికులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. 2 స్కార్పియో కార్లు, 3 ఇళ్లను అద్దెకు తీసుకొని హడావుడి చేశాడు. వడ్డీ ఇచ్చే గడువు దగ్గర పడటంతో మోసగాడు షాపు షటర్ దించి…..జెండా ఎత్తేశాడు.

అధిక వడ్డీ కోసం ఆశపడ్డ కలికిరి ప్రజలు రెండ్రోజులుగా షాపు చుట్టూ తిరిగారు. మనోహర్‌రెడ్డి జాడ లేకపోవడంతో అనుమానం వచ్చి పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఉచ్చులో ఎంత మంది పడ్డారు ? అనే వివరాలు రాబడుతున్నారు.