సైబర్‌ నేరగాళ్ల ఘరానా మోసం.. పోలీస్‌కే టోకరా..!

|

Oct 06, 2020 | 9:44 PM

ఏదైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే...ఏంటి పరిస్థితి. కడప జిల్లాలో ఇదే జరిగింది. రాజంపేటకు చెందిన కానిస్టేబుల్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి... నిండా మునిగాడు.

సైబర్‌ నేరగాళ్ల ఘరానా మోసం.. పోలీస్‌కే టోకరా..!
Follow us on

ఏదైనా సమస్య వస్తే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ ఆ పోలీసులకే సమస్య వస్తే…ఏంటి పరిస్థితి. కడప జిల్లాలో ఇదే జరిగింది. రాజంపేటకు చెందిన కానిస్టేబుల్‌ ఈశ్వర్‌రెడ్డి- ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి… నిండా మునిగాడు. దీంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ ఈశ్వర్ రెడ్డి ఆర్నెళ్ల నుంచి జేఎస్ క్లబ్‌, యోకో క్లబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ జరిపాడు. అయితే – కొంతకాలం ట్రాన్సాక్షన్స్‌ బాగానే జరిగాయి. కానిస్టేబుల్‌కు మాయ మాటలు చెప్పి 25 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఇంకేముంది… క్లబ్‌ల నుంచి నో రెస్పాన్స్‌. మోసపోయానని తెలుసుకున్న సదరు కానిస్టేబుల్‌ – గత నెల9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కానీ అప్పటికే… ఓ ఫిర్యాదు మేరకు ఆ రెండు క్లబ్‌లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. చైనాకు చెందిన యాన్‌కో, హర్యానాకు చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌కపూర్‌లను జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న రాజంపేట పోలీసులు – పీటీ వారెంట్‌పై వారిని నందలూరు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. మోసాలకు పాల్పడ్డ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీలను హోల్డ్‌లో పెట్టారని పోలీసులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.