చెన్నై: ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త నటుడు శరత్ కుమార్లకు కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. వివరాల్లోకి వెళితే…. తమిళ హీరో శరత్ కుమార్, అతని భార్య, నటి, నిర్మాత రాధికా శరత్ కుమార్ , మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ లు రెడియన్స్ మీడియా సంస్ధకు బాకీ పడిన రూ. 2కోట్లు ఇవ్వకపోవడంతో చెన్నై లోని సైదాపేట కోర్టు వారిని అరెస్టు చేయమని ఆదేశాలిచ్చింది.
రాధికా, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ లు కలిసి గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో రేడియన్స్ మీడియా సంస్ధనుంచి తీసుకున్న అప్పుకు సెక్యురిటీగా రూ.2 కోట్లకు గానూ చెక్కును ఇచ్చారు. కాగా… ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్ధ కోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాధిక, శరత్ కుమార్, లిస్టింగ్ స్టీఫెన్లు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి వీరిని అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 12 కి వాయిదా వేశారు.