ఇది ఇక రైతు భారతం.. నిత్యావసర వస్తు చట్ట సవరణ.. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 6:08 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆరు దశాబ్దాల (1955) నాటి నిత్యావసర వస్తువుల చట్టానికి..

ఇది ఇక రైతు భారతం.. నిత్యావసర వస్తు చట్ట సవరణ.. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్
Follow us on

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆరు దశాబ్దాల (1955) నాటి నిత్యావసర వస్తువుల చట్టానికి చేసిన సవరణను ఆమోదించింది. వ్యవసాయోత్పత్తుల నిల్వలపై ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తున్న ఈ చట్టాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధానంగా ఈ చట్ట సవరణ చేసినట్టు మంత్రులు ప్రకాష్ జవదేకర్, నరేంద్ర తోమర్ మంత్రివర్గ సమావేశానంతరం మీడియాకు తెలిపారు.  సవరణ అనంతరం పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఆయిల్ సీడ్స్, అపరాలు, ఉల్లిపాయలు, పొటాటో వంటి ఉత్పత్తులను ఇక డీరెగ్యులేట్ చేసే సూచనలున్నాయని, దీని వల్ల వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని వారు చెప్పారు.

ఈ సవరణ నేపథ్యంలో ఏ స్టాక్ పరిమితి కూడా ప్రాసెసర్లకు వర్తించబోదని, ఈ విధమైన పరిమితులు కేవలం అసాధారణ పరిస్థితుల్లోనే.. అంటే ప్రకృతి విపత్తులు, దుర్భిక్షం వంటి పరిస్థితుల్లోనే విధిస్తారని అఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కూడా తెలిపారు.

దేశంలో నిత్యావసరాల కొరత ఉన్నప్పుడు ఈ చట్టం తెచ్చా రు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు అని ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఉత్పత్తులు అధికంగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించాల్సిందే అని ప్రభుత్వం అభిప్రాయపడిందన్నారు. సంస్కరణల్లో భాగంగా రైతులకు, వ్యవసాయ రంగానికి పెద్దగా ఊతమిచ్చేందుకు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం గత నెలలోనే నిర్ణయించిందన్నారు. పేదలు, రైతులు, చిన్న తరహా వ్యాపారులు, కరోనా వైరస్ కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఇటీవల ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ విధమైన సహాయక చర్యలు తోడ్పడతాయని ఆయన చెప్పారు. వన్ నేషన్-వన్ మార్కెట్ పథకాన్ని అమలు చేయాలని  కూడా కేబినెట్ తీర్మానించిందన్నారు.

పెట్టుబడులను ఆకర్షించడానికి పాత నిత్యావసరాల వస్తు చట్టం అవరోధంగా ఉందని ప్రభుత్వం భావించిందని మరో మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఎకానమీ వృద్దికి తోడ్పడేందుకు కేబినెట్ ఈ వారంలో రెండో సారి సమావేశమైందన్నారు. రైతులకు సంబంధించిన 50 ఏళ్ళ డిమాండు ఈ నాటితో నెరవేరిందన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షించేందుకు ఆయా మంత్రుల శాఖలు, డిపార్ట్ మెంట్లలో అధీకృత సెక్రటరీల ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ విభాగాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని, కోల్ కతా పోర్టు ట్రస్టు పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు గా మార్చాలని కూడా తీర్మానించిందని ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు

వ్యవసాయోత్పత్తుల అంతర్ రాష్ట్ర విక్రయాన్ని అనుమతించేందుకు చట్ట రూపకల్పన

2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న లక్ష్యం

పాన్ కార్డు గల ఎవరికైనా  వ్యవసాయోత్పత్తుల కొనుగోలుకు అనుమతి

కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం మోడల్ అగ్రిమెంట్

కనీస మద్దతు ధర పెంపు

స్వామినాథన్ నివేదికకు ఆమోదం

ఇన్ ఫుట్ కాస్ట్ కన్నా 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర చెల్లింపునకు అనుమతి

రైతులకు సంబంధించిన వివాదాస్పద అంశాల్లో నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్లకు తగిన బాధ్యత

రైతుల భూముల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉండరాదని తీర్మానం

నిత్యావసరాల చట్ట పరిధి నుంచి పలు సరకులకు ‘విముక్తి’

మోదీ సంక్షేమ పథకాల కింద 9.54 లక్షల మంది రైతులకు ప్రయోజనం