తెలంగాణలో 102 ప్రభుత్వ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.1,06,990 జీతం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు జీతం లభిస్తుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఉంది. రాత పరీక్షను జనవరి 2027లో నిర్వహించనున్నారు. అర్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి..

తెలంగాణలో 102 ప్రభుత్వ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.1,06,990 జీతం
TGPSC MPSO ASO Notification

Updated on: Nov 16, 2026 | 6:24 AM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో ఖాళీగా ఉన్న 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అక్టోబర్ 30, 2026 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27, 2026తో ముగియనుంది. రాత పరీక్షను 2027 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఏడు జోన్ల పరిధిలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

జోన్‌ల వారీగా ఖాళీల వివరాలు

  • జోన్-1 (కాళేశ్వరం): 12 పోస్టులు
  • జోన్-2 (బాసర): 14 పోస్టులు
  • జోన్-3 (రాజన్న): 15 పోస్టులు
  • జోన్-4 (భద్రాద్రి): 17 పోస్టులు
  • జోన్-5 (యాదాద్రి): 7 పోస్టులు
  • జోన్-6 (చార్మినార్): 25 పోస్టులు
  • జోన్-7 (జోగులాంబ): 12 పోస్టులు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఈ కోర్సుల్లో ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల్లో కనీసం ఒక సంవత్సరమైనా స్టాటిస్టిక్స్ పేపర్ చదివి ఉండాలి. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు ఆధారంగా గరిష్ఠంగా 5 సంవత్సరాలు, మాజీ సైనికులు, అర్హులైన ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం అదనపు వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రాసెసింగ్ ఫీజుకు సాధారణ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు: రూ.500 చెల్లించాలి. అలాగే పరీక్ష ఫీజు కింద అన్ని అర్హులైన అభ్యర్థులకు రూ.80 చొప్పున చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాలి. అయితే ప్రాసెసింగ్ ఫీజుకు ఈ మినహాయింపు వర్తించదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) లేదా ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 ప్రశ్నలు, 150 మార్కులు కేటాయించారు. మొత్తం పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30 అక్టోబర్, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 27 నవంబర్, 2026.
  • రాత పరీక్ష: జనవరి 2027 (తాత్కాలికం)
  • హాల్‌టికెట్ల విడుదల: పరీక్షకు 7 రోజుల ముందు

టీజీపీఎస్సీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us