
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు (CBRT) పూర్తయిన మూడు వారాల్లోపే తుది ఫలితాలను ప్రకటించే విధంగా చర్యలు చేపడుతోంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. టీజీపీఎస్సీ కొత్త విధానం ప్రకారం.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇస్తోంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన సన్నద్ధత కోసం రెండు నెలల గడువు కేటాయిస్తోంది. పరీక్ష తేదీలు ప్రకటించిన తర్వాత 25 రోజుల్లోగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పూర్తి చేస్తోంది. అనంతరం ప్రాథమిక కీ, అభ్యంతరాల పరిశీలన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB), రోడ్లు భవనాల శాఖ నియామకాల్లో ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. పీసీబీలో సహాయ సైంటిస్టు (ఎనలిస్టు గ్రేడ్-2) పోస్టులకు నిర్వహించిన సీబీఆర్టీ పరీక్షల అనంతరం కేవలం మూడు వారాల్లోనే ప్రాథమిక కీ, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఇదే విధానాన్ని ఇకపై అన్ని నియామక పరీక్షల్లో అమలు చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. నియామక ప్రక్రియలో పారదర్శకతతో పాటు వేగానికి కమిషన్ ప్రాధాన్యం ఇస్తోంది. ఒకే అంచె పరీక్ష విధానంలో మూడు నెలల్లో, రెండు అంచెల పరీక్ష విధానంలో ఆరు నెలల్లో నియామకాలను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.
పరీక్ష పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాథమిక కీని విడుదల చేస్తూ అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తోంది. సీబీఆర్టీ విధానం అమలుతో మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో జాప్యం తగ్గుతోంది. అలాగే పోస్టులకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులను మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తోంది. పీసీబీ ఎనలిస్టు గ్రేడ్-2 పోస్టులకు ఈ నెల 12, 13 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, 14న తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఈ జాబితా సంబంధిత శాఖలకు చేరిన వెంటనే అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పీసీబీలో సహాయ ఇంజినీరు (ఏఈ) పోస్టులకు అక్టోబరు 26న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు నవంబరు 18, 19 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన రెండు, మూడు రోజుల్లోనే తుది ఫలితాలు ప్రకటించే అవకాశముంది. మరోవైపు నవంబరు 6, 7 తేదీల్లో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల సీబీఆర్టీ పరీక్ష ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ గడువు నవంబరు 17తో ముగియనుంది. అనంతరం అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, ఈ నెలాఖరులోగా తుది ఎంపిక జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి.
టీజీపీఎస్సీ అమలు చేస్తున్న ఈ కొత్త విధానంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఊరట లభించనుంది. పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గనుంది. నియామక ప్రక్రియలో జాప్యం తగ్గడంతో పాటు పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. ఇదే విధానాన్ని అన్ని శాఖల నియామకాల్లో సమర్థంగా అమలు చేస్తే ఉద్యోగార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.