
హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వినూత్న సంస్కరణలు అమలు చేయనుంది. పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపే ఎంపిక ప్రక్రియను ముగించి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. PCB పరీక్షల ఫలితాలు త్వరలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో అనలిస్టు గ్రేడ్ పోస్టులకు అక్టోబర్ 24న, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు అక్టోబర్ 26న పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ప్రాథమిక కీపై మూడు రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం తుది కీతో పాటు మెరిట్ జాబితాను ప్రకటించనుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నవంబర్ రెండో లేదా మూడో వారం నాటికి విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలు, మెరిట్ జాబితాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నియామక ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని TGPSC ప్రణాళిక రూపొందించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పరీక్షలు, ప్రాథమిక కీ, అభ్యంతరాల పరిశీలన, తుది కీ, మెరిట్ జాబితా, నియామక పత్రాల జారీకి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ ప్రక్రియను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని TGPSC ప్రయత్నిస్తే అభ్యర్థులకు త్వరగా ఉద్యోగాల్లో చేరే అవకాశం లభిస్తుంది. తాజా తేదీలు, ఫలితాలు, అధికారిక నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్సైట్ పరిశీలించాల్సి ఉంటుంది.