ఆ ప్రభుత్వ బడిలో ఒకేఒక్కడు.. అతడి కోసం రోజూ బడికి వస్తున్న టీచర్!

ఓ గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతడికి బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు హాజరవుతున్నారు. రెండేళ్ల క్రితం 13 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య గత ఏడాది 8కి, ఈ ఏడాది ఒక్కరికే పడిపోయింది. గ్రామంలోని పిల్లలు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు..

ఆ ప్రభుత్వ బడిలో ఒకేఒక్కడు.. అతడి కోసం రోజూ బడికి వస్తున్న టీచర్!
Only One Student In Government School

Updated on: Oct 04, 2026 | 7:46 AM

నిర్మల్‌, అక్టోబర్ 4: పాఠశాల అంటే పిల్లల కేరింతలు, ఆటపాటలు, సందడితో కళకళలాడాలి. కానీ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మేడంపల్లి గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతడికి బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరిన ఒక్క విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు హాజరవుతూ బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ బోధనలో నిర్లక్ష్యం చేయకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

మేడంపల్లి గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల క్రితం 13 మంది విద్యార్థులు ఉండేవారు. గత ఏడాది ఆ సంఖ్య 8కి తగ్గింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏకంగా ఒక్క విద్యార్థికే పరిమితమైంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతుండటంతోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉండే పాఠశాల ప్రస్తుతం ఒక్క విద్యార్థితోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ పాఠశాలను కొనసాగిస్తూ ఉపాధ్యాయుడు బోధించడం అభినందనీయమే అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు ఎందుకు వెళ్తున్నారు? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, మౌలిక వసతులపై నమ్మకం కలిగించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us