
NeGD Internship 2026: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌కు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) 2026 సంవత్సరానికి సంబంధించిన నాన్-టెక్నికల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు దేశ డిజిటల్ పరివర్తనలో భాగస్వామ్యం కావడంతో పాటు ప్రజా సేవల డిజిటల్ వ్యవస్థల అభివృద్ధికి నేరుగా తోడ్పడే అరుదైన అవకాశంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ ఇంటర్న్‌షిప్‌లో మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు 5 పోస్టులు, అవగాహన, కమ్యూనికేషన్‌కు 2 పోస్టులు, సామర్థ్య పెంపు విభాగానికి 2 పోస్టులు, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌కు 2 పోస్టులు, ప్రాజెక్ట్ అప్రైజల్‌కు 1 పోస్టు కేటాయించారు. ఎంపికైన ఇంటర్న్‌లు DPDP చట్టానికి సంబంధించిన పాలసీ డాక్యుమెంటేషన్, డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP), డేటా ప్రైవసీ పరిశోధన వంటి అంశాలపై పని చేసే అవకాశం పొందుతారు. అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై అనుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ గత విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 10+2+3 విధానంలో 15 సంవత్సరాల విద్యను పూర్తి చేసిన వారు లేదా 10+2+4 విధానంలో ఇంజనీరింగ్ చివరి/ప్రీ-ఫైనల్ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు అర్హులు. అలాగే 10+2+5 విధానంలో డిప్లొమా, డ్యూయల్ డిగ్రీ లేదా కంబైన్డ్ కోర్సుల చివరి లేదా ప్రీ-ఫైనల్ సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ అవసరాలను బట్టి సంబంధిత అధికారుల ఆమోదంతో విద్యార్హతల్లో కొంత సడలింపు ఇవ్వవచ్చు. కేవలం కనీస అర్హతలు సాధించినంత మాత్రాన ఎంపిక ఖాయం కాదని, మెరుగైన అకాడెమిక్ రికార్డు, అదనపు నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
అభ్యర్థులను వారి విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ లేదా అంతర్గత ఎంపిక కమిటీ నిర్ణయం ద్వారా తుది ఎంపిక చేపడతారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసే NIRF ర్యాంకింగ్స్‌లో టాప్-100లో ఉన్న విద్యాసంస్థల విద్యార్థులకు అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జూన్ 7, 2026. జూన్ మూడవ వారంలో ఇంటర్వ్యూలు, మూల్యాంకన ప్రక్రియ నిర్వహించబడుతుంది. తుది ఎంపిక వివరాలు జూన్ నాలుగవ వారంలో ప్రకటించనున్నారు. ఇంటర్న్‌షిప్ జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. సంస్థ అవసరాలు, విద్యార్థుల పనితీరును బట్టి మరో మూడు నెలల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధిత విభాగాధిపతుల ఆమోదంతో స్టైఫండ్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేస్తారు.