
విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ వచ్చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం రాత్రి అధికారికంగా ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎన్‌టీఏ షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. వచ్చే నెల, అంటే నవంబర్ 22వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే అనేక సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ప్రభుత్వం ఈ జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తుంది. డిసెంబర్ 30వ తేదీన పరీక్ష కేంద్రాలను ఖరారు చేసి, తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలను జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు, మళ్లీ 28వ తేదీన నిర్వహిస్తారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జనవరి 13వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే వారికి పేపర్-1, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. పరీక్ష పూర్తయిన కొన్ని రోజులకు, అంటే ఫిబ్రవరి 12వ తేదీ నాటికి ఫలితాలను విడుదల చేస్తారు.
ఇక రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను జనవరి చివరి వారం నుంచి ప్రారంభిస్తారు. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య పరీక్షలను నిర్వహిస్తారు. రెండు విడతల్లో సాధించిన ఉత్తమ మార్కుల ఆధారంగా ఏప్రిల్‌లో జేఈఈ ర్యాంకులను విడుదల చేస్తారు.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.