
హైదరాబాద్, అక్టోబర్ 25: ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) కీలక ప్రకటన విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) తొలి విడత పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా రెండు విడతల్లో జరిగే జేఈఈ మెయిన్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 22వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువు తర్వాత రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలి.
జేఈఈ మెయిన్ 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలను జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు, తిరిగి జనవరి 28న నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే నగరం లేదా పట్టణం వివరాలను డిసెంబర్ 30న వెల్లడిస్తారు. జనవరి 13 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు పేపర్-1 రాయాలి. ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 ఉంటుంది. పరీక్షలో సాధించిన మార్కులు, పర్సంటైల్ ఆధారంగా అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తారు. తొలి విడత ఫలితాలను ఫిబ్రవరి 12 నాటికి విడుదల చేయనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్ రెండో విడత దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభం కానుంది. రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ మధ్య నిర్వహిస్తారు. రెండు విడతల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్లలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులను ప్రకటిస్తారు. ఏప్రిల్ 20 నాటికి ర్యాంకులు విడుదల చేయాలని షెడ్యూల్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. జేఈఈ మెయిన్ దరఖాస్తు షెడ్యూల్‌ను శనివారం రాత్రి ప్రకటించిన ఎన్టీఏ.. అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే రాత్రి 11 గంటల వరకు కూడా దరఖాస్తు లింక్ అందుబాటులోకి రాకపోవడంపై అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా పరీక్షల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తే విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను సిద్ధం చేసుకోవడానికి వీలుంటుంది. కానీ షెడ్యూల్‌ను రాత్రి వేళల్లో ప్రకటించి, అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించడం ఇబ్బందికరంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుల ప్రారంభ తేదీని ఒకటి లేదా రెండు రోజుల ముందుగా ప్రకటించి ఉంటే విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండేదని పేర్కొంటున్నారు.
జేఈఈ మెయిన్ 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.