దేశంలోనే తొలిసారి IIT ఖరగ్‌పూర్‌లో పీజీ వైద్య కోర్సులు ప్రారంభం.. NEET ద్వారా అడ్మిషన్లు!

దేశంలోనే తొలిసారిగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు పొందిన ఎండీ (MD) పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులు ప్రారంభం కానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరు వైద్య విభాగాల్లో మొత్తం 12 సీట్లకు నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. వైద్యం, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధనలను అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం..

దేశంలోనే తొలిసారి IIT ఖరగ్‌పూర్‌లో పీజీ వైద్య కోర్సులు ప్రారంభం.. NEET ద్వారా అడ్మిషన్లు!
IIT Kharagpur MD Courses

Updated on: Nov 13, 2026 | 8:51 AM

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ వైద్య విద్యలో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఐఐటీలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గుర్తింపు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్యా కోర్సులను ప్రారంభిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎండీ (MD) కోర్సుల్లో తొలి బ్యాచ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని డాక్టర్ బి.సి. రాయ్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఈ కోర్సులు నిర్వహించనున్నారు. వైద్య విద్యను ఇంజినీరింగ్, కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలతో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.

ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ.. భారత వైద్య విద్య భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా తమ సంస్థ చారిత్రాత్మక అడుగు వేస్తోందని తెలిపారు. కేవలం నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ వైద్యులను తయారు చేయడమే కాకుండా, వైద్య రంగంలో ఇంజినీరింగ్ ప్రతిభ, ఏఐ, పరిశోధనలను సమన్వయం చేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే కీలక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపగలిగే వైద్య నిపుణులు, ఆవిష్కర్తలను తయారు చేయాలనేది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో చేరనున్న తొలి బ్యాచ్ విద్యార్థులు ఈ కొత్త ప్రయాణంలో మార్గదర్శకులుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆరు విభాగాల్లో ఎండీ కోర్సులు

తొలి విడతలో మొత్తం ఆరు వైద్య విభాగాల్లో ఎండీ కోర్సులను ప్రారంభించనున్నారు. ప్రతి విభాగంలో రెండు సీట్లు చొప్పున మొత్తం 12 సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి
  • జనరల్ మెడిసిన్ – 2 సీట్లు
  • రేడియాలజీ – 2 సీట్లు
  • ఫిజియాలజీ – 2 సీట్లు
  • పాథాలజీ – 2 సీట్లు
  • కమ్యూనిటీ మెడిసిన్ – 2 సీట్లు
  • బయోకెమిస్ట్రీ – 2 సీట్లు

నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు నీట్ పీజీ (NEET-PG) ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించనున్నారు. అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం రెండో రౌండ్ (Round 2)లో ఈ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హతలు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించనున్నారు. వైద్య విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ తీసుకున్న ఈ నిర్ణయం కీలక పరిణామంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో వైద్యం, ఇంజినీరింగ్, ఏఐ రంగాల మధ్య పరిశోధనలకు ఇది కొత్త అవకాశాలను తెరవనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us