Metaలో రూ.9 కోట్ల ఆఫర్‌కు గుడ్‌బై.. కట్‌చేస్తే సొంతంగా AI కంపెనీనే పెట్టేసిన IIT బాంబే కుర్రాడు

మెటా వంటి ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ నుంచి కోట్లాది రూపాయల విలువైన వేతన ప్యాకేజీ ఆఫర్ వచ్చినా, దానిని తిరస్కరించి సొంత స్టార్టప్ కలను ఎంచుకున్న భారతీయ AI పరిశోధకుడు రిషభ్ అగర్వాల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివిన రిషభ్, జేఈఈలో ఆల్ ఇండియా ర్యాంక్ 33 సాధించి అనంతరం AI రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు..

Metaలో రూ.9 కోట్ల ఆఫర్‌కు గుడ్‌బై.. కట్‌చేస్తే సొంతంగా AI కంపెనీనే పెట్టేసిన IIT బాంబే కుర్రాడు
AI researcher Rishabh Agarwal Success Story

Updated on: Jul 09, 2026 | 5:00 PM

ఇటీవల AI రంగంలో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు మెటా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ కోట్లాది రూపాయల విలువైన వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అలాంటి భారీ ఆఫర్‌ను తిరస్కరించి, సొంత స్టార్టప్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేసిన AI సైంటిస్ట్ రిషభ్ అగర్వాల్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన రిషభ్ అగర్వాల్, జేఈఈలో ఆల్ ఇండియా ర్యాంక్ 33 సాధించారు. అనంతరం కెనడాలోని ప్రముఖ AI పరిశోధనా సంస్థ మిలాలో కృత్రిమ మేధస్సులో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు Google Brain, Google DeepMind, Waymo, Meta Superintelligence Labs వంటి అగ్రశ్రేణి సంస్థల్లో పనిచేసే అవకాశం దక్కింది.

ఇటీవల సోషల్ మీడియా వేదిక Xలో ఒక పోస్టు వైరల్ అయింది. రిషభ్ అగర్వాల్‌కు మెటా నుంచి సుమారు 10 లక్షల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 8.5 కోట్లకు పైగా) విలువైన ఉద్యోగ ఆఫర్ వచ్చినట్లు పేర్కొంది. అయితే దీనిపై రిషభ్ అగర్వాల్ నుంచి రియాక్షన్ మరోలా వచ్చింది.  మెటా ఇచ్చిన ఆఫర్ 10 లక్షల డాలర్ల కంటే చాలా ఎక్కువ. దీంతో ఆయనకు వచ్చిన వేతన ప్యాకేజీ అంచనాలకు మించి ఉన్నట్లు స్పష్టమైంది. 2025 ఏప్రిల్‌లో Meta Superintelligence Labs‌లో చేరిన రిషభ్, LLMల కోసం రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్‌పై పనిచేశారు. అయితే కేవలం ఐదు నెలలకే ఆయన సంస్థను వీడాలని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయం గురించి Xలో స్పందిస్తూ Google Brain, DeepMind, Meta వంటి సంస్థల్లో 7.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత భిన్నమైన రిస్క్ తీసుకోవాలనిపించిందని, అలాగే మార్క్ జుకర్‌బర్గ్ చెప్పిన ‘రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్’ అనే మాటలను తన పోస్టులో ఉటంకించాడు. అందుకే తన జాబ్ ను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు.

మెటాలో కొనసాగకుండా రిషభ్ అగర్వాల్ Periodic Labs అనే AI స్టార్టప్‌లో ఫౌండింగ్ సభ్యుడిగా చేరారు. ఈ సంస్థ శాస్త్రీయ పరిశోధనల కోసం కొత్త ఆలోచనలు, హైపోథిసిస్‌లను రూపొందించగల AI Scientistను అభివృద్ధి చేస్తోంది. కొత్త ఆవిష్కరణలు, ఔషధాల అభివృద్ధి, భౌతిక శాస్త్ర పరిశోధనలను వేగవంతం చేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం ఈ స్టార్టప్‌కు ఎన్‌విడియా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మద్దతు లభించినట్లు సమాచారం. రిషభ్ అగర్వాల్ ప్రధానంగా రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) రంగాల్లో పరిశోధనలు చేశాడు. అతని పరిశోధనలకు గానూ NeurIPS Outstanding Paper Award కూడా లభించింది. అలాగే Googleకి చెందిన Gemma, Gemini AI మోడళ్ల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించాడు. AI పరిశోధనలో చేసిన విశేష కృషితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. భారీ వేతన ప్యాకేజీని వదులుకుని సొంత ఆలోచనను నిజం చేసే దిశగా అడుగులు వేసిన రిషభ్ అగర్వాల్ కథ.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రిషబ్ నిర్ణయం కేవలం కెరీర్ ఎంపిక మాత్రమే కాకుండా.. ఆవిష్కరణలపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా మారింది.

Follow Us