వీకెండ్ వచ్చిందంటే చాలు.. 88 సార్లు పేదలకు అన్నదానం చేసిన ఐదుగురు IT ఉద్యోగులు!

చెన్నైకి చెందిన ఐదుగురు కాగ్నిజెంట్ ఐటీ ఉద్యోగులు తమ వారాంతాలను సేవా కార్యక్రమాలకు అంకితం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2020లో కరోనా సమయంలో ప్రారంభమైన వీరి సేవా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. వృద్ధాశ్రమాలు, అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలకు స్వయంగా వంట చేసి భోజనం వడ్డిస్తున్నారు. ఇప్పటివరకు 88 సార్లు భోజన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 200 మంది దాతల సహకారాన్ని పొందారు. ఒక్కో కార్యక్రమంలో సుమారు 200 మందికి ఆహారం అందిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజ సేవకు సమయం కేటాయిస్తున్న ఈ ఐదుగురి మంచి మనసు అందరి ప్రశంసలు అందుకుంటోంది..

వీకెండ్ వచ్చిందంటే చాలు.. 88 సార్లు పేదలకు అన్నదానం చేసిన ఐదుగురు IT ఉద్యోగులు!
Cognizant Team Completes 88 Food Service Events

Updated on: Nov 13, 2026 | 6:50 AM

చెన్నై, నవంబర్ 13: సాధారణంగా ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబ సభ్యులతో గడపడం, స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ చెన్నైకి చెందిన ఐదుగురు ఐటీ ఉద్యోగులు మాత్రం తమ వీకెండ్ సమయాన్ని అనాథ పిల్లలు, వృద్ధుల ఆకలి తీర్చేందుకు కేటాయిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 88 సార్లు భోజన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 200 మంది దాతల సహకారాన్ని పొందారు. చెన్నైలోని కాగ్నిజెంట్ (Cognizant Technology Solutions) సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు సహోద్యోగులు 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్నేహితుల ద్వారా పరిచయమైన వీరంతా నగరానికి దూరంగా ఉన్న వృద్ధాశ్రమాలు, బాలల సంరక్షణ కేంద్రాలకు తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ బృందానికి ‘Outreach Ministry Leadership & Operations Team’ అని పేరు పెట్టుకున్నారు. ఇందులో సెంథిల్‌నాథన్ ఎల్., పి. యేసురాజా, సతీష్ రాజా, సంతోష్, సంజీవ్ నందా ఉన్నారు. వీరంతా చెన్నైలోని షోలింగనల్లూర్, MEPZ క్యాంపస్‌లలో పనిచేస్తున్నారు. ఈ ఐదుగురి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోరు. తామే స్వయంగా వంటకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేసి, వంట ఏర్పాట్లు చేసుకుని, వృద్ధులకు, పిల్లలకు దగ్గరుండి భోజనం వడ్డిస్తారు. ప్రతి కార్యక్రమానికి ముందుగా ఏ సంస్థకు వెళ్లాలనే విషయాన్ని నిర్ణయించుకుంటారు. ఆయా సంస్థల వివరాలు, విశ్వసనీయతను పరిశీలించిన తర్వాతే అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు మరక్కానం, రెడ్ హిల్స్, అలమతి ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాలు, బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించారు.

ప్రతి కార్యక్రమంలో సుమారు 200 మందికి భోజనం

ఈ బృందంలో యేసురాజా కిరాణా సరుకుల కొనుగోలు బాధ్యతలు చూసుకుంటారు. ఇందుకోసం ప్రతి శుక్రవారం చెన్నైలోని ప్యారీస్ మార్కెట్‌కు వెళ్లి మరుసటి రోజు కార్యక్రమానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేస్తారు. తిరువళ్లూరుకు చెందిన కలందర్ అనే వంట నిపుణుడి సహకారంతో రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తారు. వీరి మెనూలో శాఖాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ఉంటాయి. ఒక్కో కార్యక్రమంలో సుమారు 200 మందికి భోజనం అందిస్తున్నారు. ఈ బృందం డబ్బులు ఇవ్వడం కంటే స్వయంగా వంట చేసి భోజనం వడ్డించడానికే ప్రాధాన్యత ఇస్తోంది. తాము వెళ్లే సంస్థల్లో వంట చేసేందుకు, భోజనం వడ్డించేందుకు అనుమతి ఉన్న చోట్లనే కార్యక్రమాలు నిర్వహిస్తామని సెంథిల్‌నాథన్ తెలిపారు. నివాసితులకు ఒక ప్రత్యేకమైన భోజన అనుభూతిని అందించాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. ప్రారంభంలో నెలకు ఒకసారి మాత్రమే కార్యక్రమాలు నిర్వహించిన ఈ బృందం, ప్రస్తుతం నెలకు కనీసం రెండు కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 88 భోజన సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 200 మంది ఆర్థికంగా సహకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భోజనంతో పాటు వృద్ధులకు అవసరమైన ఇతర వస్తువులను కూడా అందిస్తున్నారు. నిధుల సేకరణ బాధ్యతలను సంజీవ్ నందా చూసుకుంటున్నారు. అలాగే యేసురాజా ఈరోడ్‌కు వెళ్లి ఆశ్రమవాసుల కోసం బెడ్‌షీట్లు కొనుగోలు చేశారు. తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ నవంబర్ 21న రెడ్ హిల్స్‌లోని ఓ ఆశ్రమంలో మరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ ఐదుగురు సిద్ధమవుతున్నారు. దీపావళి ప్రత్యేక విందుగా పిల్లల అభిరుచికి అనుగుణంగా చికెన్ బిర్యానీ, స్వీట్లు అందించనున్నారు. ప్రతి కార్యక్రమం పూర్తయిన తర్వాత తమకు ప్రత్యేకమైన ఆనందం కలుగుతుందని సంజీవ్ నందా తెలిపారు. ఉద్యోగం చేస్తూనే సమాజానికి తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ ఐదుగురు ఐటీ ఉద్యోగులు నిజంగా అభినందనీయులు. వీరి సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us