7 రోజుల్లో కుక్క వంకర తోకను నిటారుగా చేయగలమా? చిక్కుప్రశ్న

మనిషి స్వభావాన్ని బలవంతంగా మార్చడం సాధ్యమేనా? ఒకరి అలవాట్లను మార్చాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆసక్తికరమైన అక్బర్‌–బీర్బల్ కథ ఇది. కుక్క వంకర తోకను నిటారుగా చేయాలంటూ అక్బర్ ఇచ్చిన సవాలును బీర్బల్ తన తెలివితేటలతో ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం..

7 రోజుల్లో కుక్క వంకర తోకను నిటారుగా చేయగలమా? చిక్కుప్రశ్న
Can Anyone Change A Dogs Natural Instinct

Updated on: Nov 10, 2026 | 11:40 AM

ఒకరోజు అక్బర్‌ ఆస్థానంలో ఒక నల్ల కుక్కను నిలబెట్టి, దాని వంకరగా ఉన్న తోకను చూపించాడు. అనంతరం బీర్బల్‌ను పిలిచి.. ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని, సరైన మార్గం తెలిస్తే ఏ పనైనా సాధ్యమేనని అన్నాడు. దానికి బీర్బల్‌ కూడా అంగీకరించాడు. వెంటనే అక్బర్‌ అసలు సవాలు విసిరాడు. ఆ కుక్క తోకను నిటారుగా చేసి చూపించాలని ఆదేశించాడు. ఇందుకోసం ఏడు రోజుల సమయం ఇచ్చాడు. విజయం సాధిస్తే గొప్ప బహుమతి ఇస్తానని, విఫలమైతే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనే తన వాదన తప్పని అంగీకరించాలని షరతు పెట్టాడు. బీర్బల్‌ ఏమాత్రం భయపడకుండా సవాలును స్వీకరించాడు. మొదటి రోజు బీర్బల్‌ కుక్కకు మంచి ఆహారం పెట్టి, ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత దాని తోకను చేతితో పట్టుకుని నిటారుగా చేయడానికి ప్రయత్నించాడు. చేతితో పట్టుకున్నంతసేపు తోక నిటారుగా ఉన్నప్పటికీ, వదిలేయగానే మళ్లీ వంకరగా మారిపోయింది.

రెండో రోజు మరో ప్రయత్నం చేశాడు. కుక్క తోకను గట్టిగా పట్టుకుని నిటారుగా ఉంచాలని చూశాడు. కానీ కుక్క కదలడంతో పాటు తన సహజ స్వభావం ప్రకారం తోకను మళ్లీ వంకరగా ఉంచింది. దీంతో ఒక విషయాన్ని బీర్బల్‌ అర్థం చేసుకున్నాడు. ఏదైనా వస్తువును కొద్దిసేపు బలవంతంగా మార్చడం వేరు.. దానిని శాశ్వతంగా మార్చడం వేరు. మూడో రోజు అక్బర్‌ బీర్బల్‌ను పిలిచి తోక నిటారుగా అయిందా అని అడిగాడు. బీర్బల్‌ తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పాడు. అయితే అక్బర్‌కు మాత్రం ఫలితం కావాలని స్పష్టం చేశాడు. నాలుగో రోజు బీర్బల్‌ ఇంటి ముందు ఒక పేద వృద్ధుడు తన కుక్కతో బాధగా కూర్చుని ఉండటం చూశాడు. ఆ కుక్కకు ఆహారం కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని, అదే తనకు ఉన్న ఏకైక తోడని వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే బీర్బల్‌ ఆ వృద్ధుడికి, అతని కుక్కకు ఆహారం ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఆ కుక్క ఆనందంగా తోక ఊపడం గమనించాడు. అప్పుడే బీర్బల్‌కు ఒక విషయం అర్థమైంది. మనుషులైనా, జంతువులైనా వారి సహజ స్వభావాన్ని బలవంతంగా మార్చడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రేమ, ఆప్యాయత, మంచి ప్రవర్తనతో వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చు.

ఐదో రోజు.. మళ్లీ నవ్వులపాలైన బీర్బల్‌!

ఐదో రోజు బీర్బల్‌ కుక్కను తీసుకుని రాజదర్బారుకు వచ్చాడు. అందరి ముందు దాని తోకను నిటారుగా పట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు తోక నిటారుగా కనిపించింది. కానీ చేతిని వదలగానే మళ్లీ వంకరగా మారిపోయింది. దీంతో అక్బర్‌తో పాటు సభలోని వారంతా నవ్వారు. బీర్బల్‌ ఓడిపోయాడని భావించారు. అయితే తనకు ఇంకా రెండు రోజుల సమయం ఉందని బీర్బల్‌ ప్రశాంతంగా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఆరవ రోజు.. ఎలాంటి ప్రయత్నం చేయని బీర్బల్‌

ఆరవ రోజు బీర్బల్‌ కుక్క తోకను నిటారుగా చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దానికి మంచి ఆహారం పెట్టి, విశ్రాంతి తీసుకునేలా చేశాడు. ఇది చూసిన ఓ వ్యక్తి.. చివరి రోజు దగ్గరపడుతున్నా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. దానికి బీర్బల్‌.. ఒక సమస్యను పరిష్కరించే ముందు అసలు అది సమస్యేనా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యమని సమాధానమిచ్చాడు. చివరకు ఏడో రోజు వచ్చింది. రాజదర్బారం జనాలతో నిండిపోయింది. అక్బర్‌ తన విజయం ఖాయమని భావిస్తూ బీర్బల్‌ను పిలిచాడు. కుక్క తోకను నిటారుగా చేశావా లేదా అని ప్రశ్నించాడు. బీర్బల్‌ కుక్కను సభ మధ్యలో నిలబెట్టాడు. దాని తోక ఎప్పటిలాగే వంకరగా ఉంది. అప్పుడు అక్బర్‌.. బీర్బల్‌ ఓడిపోయాడని ప్రకటించాడు. కానీ బీర్బల్‌ ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. ‘మహారాజా! కుక్క తోకను కొన్ని క్షణాల పాటు నిటారుగా ఉంచడం నాకు మొదటి రోజే సాధ్యమైంది. కానీ దాని సహజ స్వభావానికి విరుద్ధంగా శాశ్వతంగా మార్చడం సాధ్యం కాదు. మీరు కోరుకున్నది శాశ్వత మార్పు అయితే అది నా వల్ల మాత్రమే కాదు.. ఎవరి వల్లా సాధ్యం కాదు.’

అప్పుడు అక్బర్‌.. ఈ విషయం మొదటి రోజే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. దానికి బీర్బల్‌.. మొదటి రోజే అలా చెబితే తాను ఓటమి నుంచి తప్పించుకోవడానికి సాకులు చెబుతున్నానని అందరూ భావించేవారని, అందుకే తన ప్రయత్నాల ద్వారా తాత్కాలిక మార్పుకు, శాశ్వత మార్పుకు మధ్య ఉన్న తేడాను అందరికీ చూపించాలనుకున్నానని వివరించాడు. బీర్బల్‌ మాటలు విన్న అక్బర్‌ అతని తెలివితేటలను మెచ్చుకున్నాడు. మనిషి అలవాట్లు, ఆలోచనలు, స్వభావాన్ని కేవలం ఆదేశాలతో మార్చలేమని గ్రహించాడు. అయితే మనిషి మారడం అసాధ్యం కాదు. తన తప్పులను గుర్తించి, తనలో మార్పు రావాలని స్వయంగా కోరుకున్నప్పుడు మాత్రమే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఒక్కటే.. ఇతరులను బలవంతంగా మార్చాలని ప్రయత్నించే బదులు, వారిని అర్థం చేసుకోవాలి. మార్పు అనేది ఒత్తిడితో కాదు.. అవగాహన, సహనం, ప్రేమతో రావాలి. మన జీవితంలో కూడా కొందరిని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరి స్వభావాన్ని మనం మార్చలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఎదుటివారిని మార్చడం కంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే గొప్ప విజయం!

Loading...
Unable to load recommendations.
Follow Us