APPSC Group 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. 720 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తులు ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. APPSC గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ప్రకటించిన 686 పోస్టులను 720కి పెంచుతూ కమిషన్ డీటైల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి..

APPSC Group 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. 720 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తులు ప్రారంభం
APPSC Group 2 Notification

Updated on: Nov 11, 2026 | 6:27 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి డీటైల్డ్ నోటిఫికేషన్‌ను నవంబర్ 10న విడుదల చేసింది. గత నెల విడుదల చేసిన సంక్షిప్త నోటిఫికేషన్‌లో 686 పోస్టులు ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 720కి పెంచింది. దీంతో అదనంగా 34 పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్‌ను 2027 ఫిబ్రవరి 21న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మొత్తం 720 పోస్టుల్లో ముఖ్యమైన ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి..

APPSC గ్రూప్-2 పోస్టుల వివరాలు

  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III పోస్టుల సంఖ్య: 6
  • డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 176
  • కోఆపరేటివ్ సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల సంఖ్య: 10
  • డిప్యూటీ తహశీల్దార్ పోస్టుల సంఖ్య: 203
  • సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 7
  • గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 40
  • ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 29
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 80
  • సీనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 91
  • జూనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 47
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 31

గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అయితే కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) పోస్టుకు లా డిగ్రీ తప్పనిసరి. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఏఎస్‌ఓ (ఫైనాన్స్) పోస్టులకు గణితం, అర్థశాస్త్రం లేదా వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ ఉండాలి. అకౌంటింగ్ పోస్టులకు కంప్యూటర్ సంబంధిత అర్హతలు కూడా అవసరం. పోస్టును బట్టి నిర్దేశించిన ఇతర అర్హతలు, శారీరక ప్రమాణాలను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే 2026 జూలై 1 నాటికి పోస్టును బట్టి కనీస వయోపరిమితి 18 లేదా 21 సంవత్సరాలు కాగా, గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలకు దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతభత్యాలు ఇవే..

  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: రూ.45,830 – 1,30,580
  • డిప్యూటీ తహశీల్దార్, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: రూ.44,570 – 1,27,480
  • జీఎస్టీ ఆఫీసర్: రూ.45,830 – 1,30,580
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: రూ.45,830 – 1,30,580
  • డిప్యూటీ ఎంపీడీవో: రూ.45,830 – 1,30,580
  • సీనియర్ అకౌంటెంట్: రూ.34,580 – 1,07,210
  • జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ.25,220 – 80,910
  • ఇతర పోస్టులకు రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు పే స్కేల్ ఉంటుంది.

ఎంపిక విధానం

APPSC గ్రూప్-2 నియామక ప్రక్రియలో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్: ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో ఓఎంఆర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్: స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహిస్తారు. ఇది 300 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్: నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. తప్పు సమాధానాలకు ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 10 నవంబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 10 నవంబర్ 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 30 నవంబర్ 2026
  • స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 21 ఫిబ్రవరి 2027

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us