ఏపీ 10th Class పబ్లిక్ పరీక్షల క్వశ్చన్‌ పేపర్లలో కీలక మార్పులు.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

రాష్ట్ర 2026-27 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పలు మార్పులు చేశారు. పరాఖ్ మార్గదర్శకాల మేరకు అవగాహన, సృజనాత్మకత, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త బ్లూప్రింట్, నమూనా పేపర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రశ్నల సరళిలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి..

ఏపీ 10th Class పబ్లిక్ పరీక్షల క్వశ్చన్‌ పేపర్లలో కీలక మార్పులు.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
AP 10th Class New Exam Pattern

Updated on: Jul 14, 2026 | 6:56 AM

అమరావతి, జులై 14: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కొత్త బ్లూప్రింట్‌తో పాటు నమూనా ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. మార్పులతో కూడిన ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తెలుగు సబ్జెక్టులో గతంలో తొలగించిన ‘ప్రతిపదార్థం’ ప్రశ్నను మళ్లీ ప్రవేశపెట్టడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఒక పద్యాన్ని ఇచ్చి, అందులోని ప్రతి పదానికి అర్థం రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకు మొత్తం 8 మార్కులు కేటాయించారు. తెలుగు భాషా పండితులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వారి సూచనలు, అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ ప్రశ్నను తిరిగి చేర్చినట్లు అధికారులు తెలిపారు.

హిందీ ప్రశ్నపత్రంలో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు 31 ప్రశ్నలు ఉండగా, అదనంగా మరో ప్రశ్నను చేర్చి మొత్తం 32 ప్రశ్నలు అడగనున్నారు. కేంద్ర ప్రభుత్వ పరాఖ్‌ (PARAKH – Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టినట్లు పరీక్షల విభాగం వెల్లడించింది. కొత్త విధానంలో అవగాహనకు 60 శాతం, సున్నితత్వానికి 20 శాతం, సృజనాత్మకతకు 20 శాతం వెయిటేజీ కేటాయించారు.

హిందీ, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులకు మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్, జీవశాస్త్రంలో చెరో 17 ప్రశ్నలు ఇవ్వనుండగా, సైన్స్‌లో ఒక్కో పేపర్‌కు 50 మార్కులు కేటాయించారు. ప్రశ్నల విభజనలో వ్యాసరూప ప్రశ్నలకు 56 శాతం, లఘు ప్రశ్నలకు 12 శాతం, అతి లఘు ప్రశ్నలకు 18 శాతం, లక్ష్యాత్మక ప్రశ్నలకు 14 శాతం ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థుల అవగాహన, విశ్లేషణ, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేసే విధంగా ప్రశ్నపత్రాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సూచించింది. గత ఏడాది కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం, ఈసారి మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్త బ్లూప్రింట్‌తో విద్యార్థులు పరీక్షలకు మరింత సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం లభించనుంది.

Follow Us