
అమరావతి, సెప్టెంబర్ 16: మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీసు శాఖలో మొత్తం 438 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లో 9, కమ్యూనికేషన్స్ విభాగంలో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO)లో 10 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 1156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఉంది. ఇందులో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఫైర్, జైళ్లతో పాటు ఇతర అనుబంధ విభాగాల పోస్టులు ఉన్నాయి. పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్లు, మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో 171 వార్డర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో పురుష, మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయాలజీ/సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు తేదీలను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.