
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (AP SLPRB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో మొత్తం 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాల్లో పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్, ఏఆర్), ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక అర్హత నిబంధనలు ఉన్నాయి. వారు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉండాలి. విద్యార్హతలతో పాటు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలను కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. 2026 జులై 1 నాటికి కానిస్టేబుల్ సివిల్, ఏఆర్ పోస్టులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2002 జులై 2 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించినవారు అర్హులు. ఫైర్‌మెన్, వార్డర్ తదితర పోస్టులకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 1994 జులై 2 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు వయోసడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు AP SLPRB అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ (ఏపీ స్థానిక), నాన్‌లోకల్ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ (ఏపీ స్థానిక) అభ్యర్థులు రూ.150 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష (PMT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), తుది రాత పరీక్ష (మెయిన్స్) ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్ష 200 మార్కులకు, తుది రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. PMT (Physical Measurement Test): పురుష అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ కొలతలు పరిశీలిస్తారు. మహిళా అభ్యర్థులకు ఎత్తు, బరువు తదితర నిర్దేశిత ప్రమాణాలను పరిశీలిస్తారు. PET (Physical Efficiency Test): అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ వంటి ఈవెంట్లు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, సమయ పరిమితులను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వేతన శ్రేణి ఉంటుంది. పోస్టు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తించవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ, చివరి తేదీలతో పాటు ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను AP SLPRB అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.