17 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. కేవలం రూ.1 లక్షతో సోలార్ త్రీ వీలర్ తయారు చేసిన విద్యార్థి!

సాధారణంగా 17 ఏళ్ల వయసులో విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మరికొందరు భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలి? ఏ రంగంలో స్థిరపడాలి? అని ఆలోచిస్తుంటారు. కానీ గురుగ్రామ్‌కు చెందిన అక్షిత్ ఖేరా మాత్రం తన ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చాడు. పాఠశాల స్థాయి గణితం, భౌతికశాస్త్ర పరిజ్ఞానంతోనే కేవలం రూ.1 లక్ష బడ్జెట్‌తో సోలార్ సహాయంతో నడిచే త్రీ వీలర్‌ను తయారు చేశాడు. సామాన్య కుటుంబాలకు తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ వినూత్న వాహనాన్ని రూపొందించాడు..

17 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. కేవలం రూ.1 లక్షతో సోలార్ త్రీ వీలర్ తయారు చేసిన విద్యార్థి!
17 Year Old Creates Innovative Solar Vehicle

Updated on: Nov 15, 2026 | 8:53 AM

గురుగ్రామ్‌లోని హెరిటేజ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న అక్షిత్‌కు వాహనాల తయారీ, పర్యావరణ పరిరక్షణపై మొదటి నుంచీ ఆసక్తి ఉంది. అయితే అతడిలోని ఆవిష్కర్తను మేల్కొలిపింది ఒక సాధారణ కుటుంబం ఎదుర్కొంటున్న రవాణా సమస్య. అక్షిత్ ఇంట్లో పనిచేసే మహిళ కుటుంబం జీవనోపాధి కోసం వలస వచ్చి గురుగ్రామ్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబంలోని వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ సరుకులను రవాణా చేసేవాడు. సొంతంగా వాహనం కొనుగోలు చేసి చిన్న స్థాయిలో సరుకు రవాణా వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదని అక్షిత్ ప్రశ్నించాడు.

అందుకు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం అక్షిత్‌ను ఆలోచింపజేసింది. వాహనం కొనుగోలు చేయడానికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు భరించడం తమలాంటి కుటుంబాలకు సాధ్యం కాదని వివరించాడు. ఎలక్ట్రిక్ లోడర్లు ఉన్నప్పటికీ వాటి ధర రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండటంతో కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్పాడు. దీంతో అక్షిత్ మరో 20 కుటుంబాలతో మాట్లాడాడు. తక్కువ ధరలో, తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణికులను, సరుకులను తీసుకెళ్లగలిగే వాహనానికి నిజంగానే డిమాండ్ ఉందని గుర్తించాడు. అక్షిత్ రూపొందించిన ఈ త్రీ వీలర్‌లో రెండు సీట్లతో కూడిన వాతావరణ ప్రభావాలను తట్టుకునే క్యాబిన్, సరుకుల కోసం ప్రత్యేక బాక్స్, 400 వాట్ల సోలార్ ప్యానెల్‌తో కూడిన పైకప్పు ఉన్నాయి. ఈ వాహనం తయారీకి మొదట రూ.1 లక్ష బడ్జెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అన్ని భాగాల ఖర్చులు కలిపి తుది తయారీ వ్యయం రూ.1,02,536కు చేరింది. ఈ వాహనం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించగలదు. పగటిపూట సోలార్ ప్యానెల్ ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణ త్రీ వీలర్లతో పోలిస్తే ఇందులో సోలార్ ప్యానెల్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకవైపు సరుకుల బాక్స్‌కు పైకప్పులా రక్షణ కల్పిస్తూనే మరోవైపు వాహనానికి విద్యుత్ అందిస్తుంది. అక్షిత్ అంచనాల ప్రకారం రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే వాహనానికి అవసరమైన విద్యుత్‌లో సుమారు 63 శాతం సోలార్ శక్తి ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో ఇది 41 శాతానికి తగ్గగా, వేసవిలో గరిష్ఠంగా 87 శాతం వరకు చేరుతుంది.

కిలోమీటరుకు కేవలం 13 పైసల ఖర్చు!

ఈ వాహనం ప్రత్యేకత దాని తక్కువ నిర్వహణ ఖర్చు. అక్షిత్ లెక్కల ప్రకారం 50 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 2.46 కిలోవాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇందులో దాదాపు 63 శాతం విద్యుత్ సోలార్ ద్వారా లభిస్తుండటంతో, మిగిలిన విద్యుత్ ఖర్చును లెక్కించినప్పుడు కిలోమీటరుకు సుమారు 13 పైసలు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశాడు. రోజుకు 75 కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు ఈ ఖర్చు కిలోమీటరుకు సుమారు 21 పైసలకు చేరుతుందని వివరించాడు. వాహనం ధరను అందుబాటులో ఉంచడం అక్షిత్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. తొలుత తయారీ వ్యయం సుమారు రూ.1.35 లక్షలుగా అంచనా వేశాడు. దీంతో ఒక్కో విడిభాగాన్ని పరిశీలించి అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేశాడు. బ్యాటరీ సామర్థ్యాన్ని 5.38 కిలోవాట్ల నుంచి 3.072 కిలోవాట్లకు తగ్గించాడు. వాహనంలో కీలకమైన బరువు మోసే భాగాల్లో మాత్రమే మందపాటి స్టీల్ ట్యూబులను ఉపయోగించాడు. దీంతో సుమారు రూ.2,100 ఆదా కావడంతోపాటు వాహనం బరువు 26 కిలోలు తగ్గింది. తొలుత అనుకున్న 300 వాట్ల పాలీక్రిస్టలైన్ ప్యానెల్ స్థానంలో 400 వాట్ల మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్‌ను ఎంచుకున్నాడు. ఢిల్లీలోని మయాపురి ఆటోమొబైల్ మార్కెట్‌లో పలువురు విక్రేతలతో మాట్లాడి విడిభాగాల ధరలను పోల్చాడు. రూ.1,000 కంటే ఎక్కువ ధర ఉన్న విడిభాగాలకు పలు కొటేషన్లు తీసుకున్నాడు. దీంతో రూ.17 వేలకు పైగా ఆదా చేయగలిగాడు. ఎక్కువ కాలం మన్నిక ఉండటంతోపాటు పర్యావరణానికి తక్కువ హాని కలిగించే లిథియం అయాన్ బ్యాటరీని ఎంపిక చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

12కి పైగా వర్క్‌షాపులు తిరిగినా దొరకని సహకారం!

వాహనానికి సంబంధించిన డిజైన్, లెక్కలు సిద్ధం చేయడం ఒక ఎత్తయితే, దాన్ని నిజంగా తయారు చేయడానికి సరైన వర్క్‌షాప్‌ను కనుగొనడం మరో ఎత్తుగా మారింది. గురుగ్రామ్, దిల్లీ, ఫరీదాబాద్ ప్రాంతాల్లోని 12కి పైగా వర్క్‌షాపులను సంప్రదించినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు అరుణ్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్టును తయారు చేసేందుకు అంగీకరించాడు. అతడి వర్క్‌షాప్ అక్షిత్ ఇంటికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయినప్పటికీ అక్షిత్ తరచూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించేవాడు. సోలార్ ప్యానెల్ పరిమాణం, విద్యుత్ సరఫరా వ్యవస్థ రూపకల్పనలోనూ సమస్యలు ఎదురయ్యాయి. చివరకు 400 వాట్ల ప్యానెల్‌కు అనుగుణంగా బూస్ట్ కంట్రోలర్‌తో విద్యుత్ వ్యవస్థను పునఃరూపకల్పన చేశాడు. వర్షాకాలంలో తేమ కారణంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్లైవుడ్‌కు బదులుగా పెయింట్ చేసిన స్టీల్ షీట్లను సరుకుల బాక్స్ అడుగుభాగంలో ఉపయోగించాడు.

అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటిన విద్యార్థి

అక్షిత్‌కు ఇంజినీరింగ్ రంగంలో ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. 2025లో సింగపూర్‌లో జరిగిన STEM Racing వరల్డ్ ఫైనల్స్‌లో Apex Racing టీమ్‌కు లీడ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీర్‌గా వ్యవహరించాడు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 82 జట్లలో అతడి టీమ్ ఏడో అత్యంత వేగవంతమైన సగటు సమయాన్ని నమోదు చేసింది. ఈ అనుభవం సోలార్ త్రీ వీలర్ తయారీలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడింది. అక్షిత్ తల్లిదండ్రులు అమిత్ ఖేరా, కాంచన్ ఖేరా అతడి ప్రయత్నాలకు పూర్తి సహకారం అందించారు. నెలల తరబడి లెక్కలు వేయడం, విడిభాగాల కోసం వెతకడం, వర్క్‌షాపుల చుట్టూ తిరగడం వంటి పనుల్లో అతడిని ప్రోత్సహించారు. తక్కువ ధర కోసం నాణ్యత విషయంలో రాజీపడకుండా లిథియం అయాన్ బ్యాటరీని ఎంచుకోవడం, వాహనం దీర్ఘకాలిక పనితీరు, పర్యావరణ ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం తమకు ఎంతో గర్వంగా అనిపించిందని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ త్రీ వీలర్‌ను అక్షిత్ ఒక ప్రోటోటైప్‌గానే భావిస్తున్నాడు. వాస్తవ పరిస్థితుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించి దాని పనితీరును నిర్ధారించుకోవాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా వివిధ రుతువుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వాహనం ప్రయాణ సామర్థ్యం, నిర్వహణ ఖర్చులను పరిశీలించాలనుకుంటున్నాడు. భారీ స్థాయిలో తయారీ ప్రారంభిస్తే ప్రస్తుత ధరతో పోలిస్తే 10 నుంచి 20 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. ఆటోమొబైల్ తయారీ సంస్థతో భాగస్వామ్యం కుదిరితే ఈ ఆవిష్కరణను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తున్నాడు. అయితే ఒక షరతు విధిస్తున్నాడు. ఈ వాహనం అసలు లక్ష్యమైన తక్కువ ధరను మాత్రం పెంచకూడదని స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ వాహనాన్ని అవసరమైన ఒక పేద కుటుంబానికి ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు.

భవిష్యత్తులో గణితశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు దాని ఆచరణాత్మక అనువర్తనాలపై పరిశోధన చేయాలని అక్షిత్ భావిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత తేలికైన సోలార్ సెల్స్, అధునాతన పదార్థాలు, మెరుగైన విద్యుత్ నిర్వహణ వ్యవస్థలతో వాహనాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. బ్యాటరీలను మార్చుకునే సౌకర్యం, సరుకు రవాణా వాహనాల కోసం ఉమ్మడి సోలార్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. యువతకు అతడు ఇచ్చే సందేశం ఒక్కటే. ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలంటే పెద్ద బడ్జెట్, ప్రత్యేక బృందం, అత్యాధునిక ప్రయోగశాల ఉండాల్సిన అవసరం లేదు. ఆసక్తి, పట్టుదల, నేర్చుకోవాలనే తపన ఉంటే చిన్న ఆలోచన కూడా పెద్ద ఆవిష్కరణగా మారుతుంది. 17 ఏళ్ల వయసులోనే అక్షిత్ ఖేరా తన ప్రయోగంతో దీనిని నిరూపించాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us