
ఈ ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఏసీ కామన్‌గా మారింది. ఎండలో నుంచి వచ్చి ఏసీ చల్లటి గాలిలో కూర్చుంటే స్వర్గంలా అనిపిస్తుంది. కానీ ఈ ఎండల తాకిడికి మనల్ని కాపాడే ఏసీలు కూడా ఓవర్‌టైమ్ డ్యూటీ చేస్తూ అల్లాడిపోతున్నాయి. చాలా మంది రెగ్యులర్ సర్వీసింగ్ చేయించినా సరే.. ఈ పీక్ సమ్మర్‌లో ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని బాధపడుతుంటారు. కొందరైతే విసిగిపోయి ఏసీ మార్చేసి కొత్తది కొందాం అనుకుంటారు. అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ఏసీ కొనే ముందు.. మీ ఏసీ కూలింగ్‌ను రెట్టింపు చేసి, కరెంట్ బిల్లును తగ్గించే ఒక సింపుల్ అండ్ సూపర్ ట్రిక్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనం సాధారణంగా ఇంట్లో ఉండే ఇండోర్ ఏసీ యూనిట్‌ను మాత్రమే క్లీన్ చేస్తూ, పట్టించుకుంటూ ఉంటాం. కానీ ఎండ దెబ్బకు అసలు సిసలైన యుద్ధం చేసేది బయట ఉండే అవుట్‌డోర్ కండెన్సర్ యూనిట్ అనే విషయం చాలా మంది మర్చిపోతారు. గదిలోని వేడిని లాగేసి బయటకు పంపే బాధ్యత ఈ అవుట్‌డోర్ యూనిట్‌దే. బయట ఎండ తీవ్రత పెరిగేకొద్దీ ఈ యూనిట్ విపరీతంగా వేడెక్కిపోతుంది. దీనివల్ల ఏసీ కంప్రెషర్ గదిని చల్లబరచడానికి నార్మల్ కంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కూలింగ్ తగ్గి.. కరెంట్ బిల్లు మోత మోగుతుంది.
ఇలాంటి సమయంలోనే ఒక పవర్‌ఫుల్ హ్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. బయట ఉన్న ఏసీ కంప్రెషర్ లేదా కండెన్సర్ యూనిట్‌పై లైట్‌గా నీళ్లు చల్లడం లేదా పోయడం ద్వారా దాని ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించవచ్చు. చాలా మందికి ఎలక్ట్రికల్ వస్తువులపై నీళ్లు పోస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుందేమోననే భయం ఉంటుంది. కానీ నిపుణుల ప్రకారం.. ఏసీ అవుట్‌డోర్ కండెన్సర్‌ను క్లీన్ చేయడానికి నీళ్లు చల్లడం పూర్తిగా సురక్షితం. నీళ్లు పోయడం వల్ల కండెన్సర్ కాయిల్స్‌పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కొట్టుకుపోవడమే కాకుండా.. ఆ నీరు ఆవిరయ్యే క్రమంలో కాయిల్స్ చాలా వేగంగా చల్లబడతాయి. దీనివల్ల ఏసీ ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదు. తక్కువ టైమ్‌లోనే గది ఐస్‌లా మారిపోతుంది. ఫలితంగా కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది.
ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌పై నీళ్లు పోయడం సురక్షితమే అయినప్పటికీ, ఈ 5 జాగ్రత్తలు పక్కాగా ఫాలో అవ్వాలి..
ఏసీ ఆఫ్ చేయండి: నీళ్లు పోయడానికి ముందు కచ్చితంగా ఇంట్లో ఏసీని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి.
కనెక్సన్లపై వద్దు: కేవలం కండెన్సర్ కాయిల్స్‌పై మాత్రమే నీళ్లు చల్లాలి. వైరింగ్, ఎలక్ట్రికల్ కనెక్షన్లు లేదా కంట్రోల్ ప్యానెల్స్ ఉన్న వైపు అస్సలు నీళ్లు కొట్టకూడదు.
ప్రెజర్ వద్దు: వాటర్ పైప్‌ను గట్టిగా నొక్కి హై ప్రెజర్ జెట్స్‌తో కొట్టకూడదు. దీనివల్ల లోపల ఉండే కండెన్సర్ ఫీన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. లైట్‌గా జల్లులాగా మాత్రమే పోయాలి.
ఆరనివ్వండి: నీళ్లు కొట్టిన తర్వాత కనీసం కొద్దిసేపు ఆరనిచ్చి, ఆ తర్వాతే ఏసీని మళ్లీ ఆన్ చేయాలి.
ఫిల్టర్ల క్లీనింగ్: వేసవిలో ఏసీలు ఎక్కువ గంటలు తిరుగుతాయి కాబట్టి.. ప్రతి 3 నుండి 4 వారాలకు ఒకసారి ఇండోర్ యూనిట్ ఫిల్టర్లను తీసి నార్మల్ ట్యాప్ వాటర్‌తో కడిగి, ఆరబెట్టి మళ్లీ ఫిక్స్ చేయాలి.
కిటికీలు, తలుపుల గ్యాప్స్: గదిలోని చల్లటి గాలి బయటకు పోకుండా తలుపులు, కిటికీల సందులను వెదర్ స్ట్రిప్పింగ్ లేదా సీలెంట్స్ ఉపయోగించి పూర్తిగా లాక్ చేయాలి.
వెంట్స్ క్లియర్: ఏసీ గాలి వచ్చే దారికి అడ్డంగా ఎలాంటి కటన్లు, ఫర్నిచర్ లేకుండా చూసుకోవాలి.