
మన దేశంలో నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి నుంచి ఇంటికి అవసరమయ్యే ప్రతీ వస్తువు తక్కువ ధరకే లభించే రిటైల్ స్టోర్ చైన్‌లలో డి మార్ట్‌ది స్పెషల్ ప్లేస్. ప్రతి నెలా షాపింగ్ చేసేవారికి డి మార్ట్ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. మహిళల కోసం కుర్తీలు, లెగ్గింగ్‌లు, టీ షర్టులు, ఇతర రెడీమేడ్ దుస్తులు లభించినప్పటికీ.. దాదాపు అన్ని శాఖల్లో చీరలు లభించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. డి మార్ట్ చీరలను ఎందుకు విక్రయించదో తెలుసా? దీని వెనుక ఒక బలమైన వ్యాపార వ్యూహం ఉంది. డి మార్ట్ విజయ రహస్యం దాని ప్రత్యేకమైన బిజినెస్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే, వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులపైనే దృష్టి పెడుతుంది. తక్కువ లాభ మార్జిన్‌తో ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించడం ద్వారా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందించడం డి మార్ట్ సూత్రం.
చీరల విక్రయం ఇతర దుస్తుల వ్యాపారం కంటే పూర్తిగా భిన్నమైనది. చీరల్లో వందల రకాల ఫ్యాబ్రిక్‌లు, విభిన్న డిజైన్లు, ప్యాటర్న్లు, రంగులు, ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్‌లు ఉంటాయి. ఇన్ని రకాల స్టాక్‌ను నిర్వహించాలంటే ఎక్కువ స్థలం, ఎక్కువ పెట్టుబడి, అలాగే నిరంతర స్టాక్ నిర్వహణ అవసరం. చీరలు కుర్తీలు లేదా నిత్యావసరాల లెక్క వేగంగా అమ్ముడవ్వవు. స్టాక్ ఎక్కువ కాలం నిల్వ ఉండిపోతే కంపెనీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
డి మార్ట్ నమూనా వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల పైనే నడుస్తుంది కాబట్టి చీరల వంటి విభాగంలో భారీగా పెట్టుబడి పెట్టడం కంపెనీకి లాభదాయకం కాదు. అందుకే కంపెనీ కేవలం కిరాణా, హోమ్ కేర్, రోజూ అమ్ముడయ్యే రెడీమేడ్ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని ఎంపిక చేసిన డి మార్ట్‌లలో కస్టమర్ల డిమాండ్‌ను బట్టి పరిమిత సంఖ్యలో చీరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కువ డీమార్ట్‌లలో చీరల కోసం ప్రత్యేక విభాగం ఉండదు.