
ప్రముఖ మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను త్వరలో ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. టెలిగ్రామ్, సిగ్నల్ ఫ్లా్ట్‌ఫామ్స్ తరహాలోనే వినియోగదారులు యూజర్‌నేమ్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పించే ఫీచర్‌ను వాట్సప్ తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా.. వివిధ ఫోన్లలో పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను కనిపించకుండా పెట్టుకోవచచ్చు. కేవలం యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. యూజర్ల ఫోన్ నెంబర్లు సైబర్ నేరగాళ్లకు తెలియకుండా భద్రత కల్పించడంలో భాగంగా వాట్సప్ ఈ కొత్త ప్రయత్నం చేస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా దీనిని ప్రవేశపెడుతున్నారు.
ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. బీటా టెస్టర్లకు ఇంకా విడుదల చేయలేదు. రానున్న రోజుల్లో మీరు ఈ ఫీచర్‌ను చూడవచ్చు. చాట్ ఏరియాలో కేవలం మీ యూజర్‌నేమ్ మాత్రమే చూపించడం వల్ల మీ ఫోన్ నంబర్ ఇతరులకు తెలియదు. యూజర్‌నేమ్‌లలో కనీసం ఒక అక్షరం ఉండాలి. www కాకుండా వేరే దానితో ప్రారంభం కావాల్సి ఉంటుంది. చిన్న అక్షరాలు (a–z), అంకెలు (0–9), చుక్కలు, అండర్‌స్కోర్‌లను మాత్రమే యూజర్ నేమ్‌లో ఉపయోగించే విధంగా వాట్సాప్ సిస్టమ్‌ను రెడీ చేస్తోంది. దీని వల్ల ఖాతాల విషయంలో గందరగోళం ఏర్పడదని భావిస్తోంది. ఇక యూజర్‌నేమ్‌ను మార్చుకుంటే.. చాట్‌లలోని ప్రతి వ్యక్తికి సిస్టమ్ ఆటోమేటిక్‌గా మెస్సేజ్ పంపుతుంది. దీనివల్ల ఎవరూ గందరగోళానికి గురికాకుండా ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. ఎప్పటినుంచి అందుబాటులోకి తెస్తారనేది త్వరలో ప్రకటించే అవకాశముంది. అయితే బీటా వెర్షన్‌లలో సంబంధిత స్ట్రింగ్‌లు ఉండటం వల్ల ఈ యాప్ త్వరలో విడుదల అవుతుందని తెలుస్తోంది.
వాట్సప్ మరిన్ని ఫీచర్లను త్వరలో లాంచ్ చేయనుంది. అదేంటంటే.. ఫేస్ బుక్ మెస్సేంజర్ తరహాలో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారనేది వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నారా..? లేదా? అనేది తెలుసుకునేందుకు వాట్సప్ ఛాట్ ఆన్ చేయాల్సి వస్తోంది. చాట్ ఓపెన్ చేస్తే వాళ్లు ఆన్‌లైన్‌లో ఉన్నారా..? లేదా..? చివరిగా ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చారు? అనే వివరాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక నుంచి చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఉన్న యూజర్ల వివరాలు అన్నీ ఒకేచోట కనిపిస్తాయి. దీంతో మీరు సులువుగా చాట్ చేసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ స్టేటస్ కనిపించకుండానే సెట్టింగ్ డిసేబుల్ చేసుకున్న యూజర్ల వివరాలు ఎప్పటిలాగే కనిపించవు. రానన్న కొద్ది రోజుల్లో ఈ ఫీచర్ రానుంది.