వారసులు లేరు.. వీలునామా రాయలేదు.. ఆ వ్యక్తి చనిపోయాక ఆస్తి ఎవరికి దక్కుతుంది..?

వీలునామా రాయకుండా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆస్తి ఎవరికి దక్కుతుంది..? కుటుంబం, వారసులు ఎవరూ లేని ఆస్తి చివరికి ఎక్కడికి చేరుతుంది..? చాలామందికి ఈ చట్టపరమైన అంశాలపై స్పష్టత ఉండదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 29 ఈ విషయంలో స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వారసులు లేరు.. వీలునామా రాయలేదు.. ఆ వ్యక్తి చనిపోయాక ఆస్తి ఎవరికి దక్కుతుంది..?
Property Without Legal Heirs Rules

Updated on: Nov 19, 2026 | 8:26 PM

వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే ఆస్తి సాధారణంగా చట్టబద్ధమైన వారసులకు దక్కుతుంది. కానీ ఎవరూ లేని ఆస్తి పరిస్థితి ఏంటి? 1956 నాటి హిందూ వారసత్వ చట్టం ఈ అంశంపై స్పష్టమైన నియమాలు చెబుతోంది. వారసులు లేకపోతే ఆస్తి ప్రభుత్వానికి చేరే ప్రక్రియ ఎలా ఉంటుందో, అప్పులు-బాధ్యతల సంగతేంటో చాలా మందికి తెలియదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం.. వీలునామా రాయకుండా మరణించిన వ్యక్తికి చట్టబద్ధమైన వారసులు ఎవరూ లేకపోతే, ఆ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. న్యాయ పరిభాషలో ఈ ప్రక్రియను ఎస్చీట్ అంటారు. అయితే ఆస్తిని ప్రభుత్వం అంత సులభంగా, వెంటనే తన ఖాతాలో వేసుకోదు.

నాలుగు దశల్లో వారసుల పరిశీలన

ఎవరూ లేరని నిర్ధారించే ముందు చట్టప్రకారం నాలుగు వరుస దశల్లో వారసుల కోసం పరిశీలిస్తారు.

మొదటి దశ: కుమారుడు, కుమార్తె, భార్య, తల్లి వంటి మొదటి శ్రేణి వారసులు ఉన్నారా లేదా చూస్తారు.

రెండో దశ: వారు లేకపోతే తండ్రి, సోదరులు, సోదరీమణులు వంటి రెండో శ్రేణి వారసులను పరిగణిస్తారు.

మూడో దశ: ఆ తర్వాత తండ్రి తరఫు మగ బంధువులకు అవకాశం ఉంటుంది.

నాలుగో దశ: చివరగా తల్లి తరఫు బంధువులను పరిశీలిస్తారు.

ఈ నాలుగు దశల్లోనూ ఎవరూ అర్హులు లేరని చట్టబద్ధంగా ధ్రువీకరించిన తర్వాతే ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా భావిస్తారు.

ఆస్తితో పాటు అప్పులు కూడా ప్రభుత్వానివే..

చాలామందికి తెలియని మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రభుత్వం వారసులు లేని ఆస్తిని తీసుకుంటే, ఒక సాధారణ వారసుడికి ఉండే బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వానికే వర్తిస్తాయి. ఆ ఆస్తిపై ఏదైనా అప్పు, తనఖా బకాయిలు లేదా ఇతర చట్టపరమైన బాధ్యతలు ఉంటే, వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది.

క్షేత్రస్థాయి విచారణ.. గెజిట్ నోటిఫికేషన్

ఈ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం నిర్దిష్ట పద్ధతిని పాటిస్తుంది. గ్రామ పరిపాలనా అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నివేదిక ఆధారంగా తహశీల్దార్ పూర్తి విచారణ చేస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ లేదా RDO జిల్లా గెజిట్‌తో పాటు ప్రధాన పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇస్తారు. నిర్దిష్ట గడువులోగా ఎవరూ సరైన ఆధారాలతో ముందుకు రాకపోతే, కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రికార్డుల్లో దాన్ని ప్రభుత్వ ఆస్తిగా మారుస్తారు.

ప్రజా ప్రయోజనాలకు వినియోగం

ఇలా సేకరించిన ఆస్తులను ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు వంటి ప్రజా అవసరాలకు కేటాయిస్తారు. ప్రజా వినియోగానికి అవసరం లేని పక్షంలో నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. దీనివల్ల ఎవరూ లేని ఆస్తి నిరుపయోగంగా మిగిలిపోకుండా సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us