
జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రస్తుతం చాలామంది వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి హామీ లేకుండానే క్షణాల్లో లోన్లు లభిస్తుండటంతో వీటిని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి పూర్తిగా తిరిగి చెల్లించకముందే దురదృష్టవశాత్తు మరణిస్తే ఏం జరుగుతుంది..? ఆ అప్పు భారం కుటుంబ సభ్యులపై పడుతుందా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయంలో బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హోమ్, వాహన లేదా బంగారు రుణాల మాదిరిగా పర్సనల్ లోన్‌కు ఎలాంటి ఆస్తి హామీ ఉండదు. అందుకే దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారు. రుణగ్రహీత మరణిస్తే, సురక్షిత రుణాల మాదిరిగా బ్యాంకులు నేరుగా వస్తువులను జప్తు చేయడం లేదా వేలం వేయడం ద్వారా డబ్బును వసూలు చేయలేవు. కానీ బకాయి మొత్తాన్ని రాబట్టుకోవడానికి బ్యాంకులు కొన్ని నిర్దిష్ట పద్ధతులను అనుసరిస్తాయి.
రుణగ్రహీత మరణించిన వెంటనే బ్యాంకు ముందుగా ఆ లోన్‌కు రుణ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ బీమా ఉంటే, బకాయి మొత్తాన్ని బీమా సంస్థ నుంచే బ్యాంకు వసూలు చేసుకుని ఖాతాను మూసివేస్తుంది. ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఆ లోన్‌కు కో అప్లికెంట్ లేదా గ్యారెంటర్ ఉన్నారేమో చూస్తుంది. ఒకవేళ ఉంటే చట్టప్రకారం ఆ బకాయిని చెల్లించే బాధ్యత వారిపైనే ఉంటుంది. వారు నిరాకరిస్తే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడేలా ఫిర్యాదు చేస్తుంది.
ఇన్సూరెన్స్, కో అప్లికెంట్, గ్యారెంటర్ ఎవరూ లేకపోతే.. మరణించిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తుల నుంచి బ్యాంకు బకాయిని వసూలు చేసుకునే వీలుంటుంది. అయితే చట్టబద్ధమైన వారసులు కేవలం వారసులైనంత మాత్రాన సొంత జేబులోంచి ఆ అప్పు కట్టాల్సిన అవసరం లేదు. లోన్ అగ్రిమెంట్‌లో ప్రత్యేకంగా ఏదైనా షరతు ఉంటే తప్ప, బ్యాంకులు వారసులను బలవంతం చేయలేవు. ఒకవేళ మరణించిన వ్యక్తి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకు ఆ మొత్తాన్ని నష్టంగా పరిగణించి రద్దు చేయాల్సి ఉంటుంది.
రుణగ్రహీత మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా, వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. మరణ ధృవీకరణ పత్రం అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంకు నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఒకవేళ ఆస్తుల విలువ మేరకు లేదా స్వచ్ఛందంగా రుణాన్ని పూర్తిగా తీర్చివేస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బ్యాంకు నుంచి తప్పనిసరిగా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.