పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఓ మధుర ఘట్టం. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువతీయువకులు కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతపీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్థోమతకు తగ్గట్టు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతుంటారు. పిల్లల కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. కరోనా సీజన్‌లో పెళ్లి వేడుకల జోరు కాస్త తగ్గినా.. గత రెండేళ్లుగా మళ్లీ జోరందుకున్నాయి. అయితే వివాహ ఖర్చులు అంచనాలను మించి ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్ట కాలాన్ని అధిగమించి ఇప్పుడు భారత్‌లో పెళ్లి వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతోంది. ఈ వ్యాపారంలో ఉన్న వారికి కాసుల వర్షం కురిపిస్తోంది.
42 లక్షల పెళ్లిళ్లు.. రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం
ప్రస్తుత మ్యారేజ్ సీజన్ లో దేశవ్యాప్తంగా 42 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందళ్లు కనువిందు చేయనున్నాయి. కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి..ఫంక్షన్ హాల్స్, బంగారం దుకాణాలు సందడి చేయనున్నాయి. దీంతో జనవరి 15 నుంచి మొదలైన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశముంది. దేశ వ్యాప్తంగా 30 ప్రధాన నగరాలలో జులై 15 వరకు జరిగే మ్యారేజెస్‌ను పరిగణలోకి తీసుకుని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ అంచనా వేసింది.
ఒక్క ఢిల్లీలోనే ఏకంగా 4 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. వీటి ద్వారా రూ.1.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్టియా తెలిపారు. పురోహితులు, క్యాటరింగ్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో పెళ్లిళ్లు ఉండటంతో అందరిలో ఉత్సాహం నెలకొనడం ఖాయం. ఈ నేపథ్యంలో పెళ్లి ముహూర్తాలు అందరికి పండగ వాతావరణం కల్పించనున్నాయి. ఇన్నాళ్లు పని లేని వారికి కూడా పని దొరకనుంది. బంగారం వ్యాపారులు కూడా మంచి గిరాకీ రానుంది. గత ఏడాది డిసెంబరు 14తో ముగిసిన గత పెళ్లిళ్ల సీజన్‌లో 35 లక్షల వివాహాలు జరగ్గా.. వీటి ద్వారా దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా.
ప్రస్తుత సీజన్‌లో జరిగే 5 లక్షల పెళ్లిళ్లకు సరాసరిగా రూ.3 లక్షల వ్యయం చేయనున్నారు. 10 లక్షల పెళ్లిళ్లకు సరాసరిగా రూ.6 లక్షల వ్యయం, 10 లక్షల పెళ్లిళ్లలకు సరాసరిగా రూ.10 లక్షల వ్యయం చేయనున్నారు. మరో 10 లక్షల పెళ్లిళ్లలకు రూ.15 లక్షల వ్యయం చేస్తారని అంచనా. 6 లక్షల పెళ్లిళ్లలను ఒక్కోటికి రూ.25 లక్షల వ్యయం, 60 వేల వివాహ వేడుకలను సరాసరి రూ.50 లక్షల వ్యయం చేసే అవకాశముంది. అలాగే మరో 40 వేల వివాహాలకు సరాసరిగా రూ. 1 కోటికి పైగా వ్యయం చేసే అవకాశముంది. ఆ రకంగా వచ్చే ఆరు మాసాల కాలంలో వివాహ శుభకార్యక్రమాలపై ఏకంగా రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనావేస్తున్నారు. ప్రతి సంవత్సరం దేశ వివాహ రంగం 7 నుంచి 8 శాతం వృద్ధిరేటును నమోదు చేసుకుంటోంది.
వెడ్డింగ్ ఇండస్ట్రీ జోరు..
కరోనా టైమ్‌లో మ్యారేజ్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు కరోనా టైమ్‌కు మునుపటి కంటే మెరుగైన స్థాయికి ఇండస్ట్రీ చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఒక్కో పెళ్లి వేడుకలో సరాసరిగా 310 మంది అతిథులు పాల్గొంటున్నారు. 2022తో పోలిస్తే ఇది 14.8 శాతం ఎక్కవని ఓ సర్వేలో తేలింది. కొనుగోలు సామర్థ్యం భారీగా పెరగడం, లగ్జరీపై ఎక్కువ మంది ఆకర్షితులు కావడం వంటి అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. 2022తో పోలిస్తే 2023లో తమ వార్షిక ఆదాయం 15 నుంచి 22 శాతం పెరిగినట్లు వివాహ రంగానికి చెందిన వ్యాపారులు చెబుతున్నారు.
వెడ్ ఇన్ ఇండియా మిషన్..
మొన్నటి వరకు సెలబ్రిటీలు డెస్టినేషన్ మ్యారేజ్ ట్రెండ్ కొనసాగేది. అయితే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవల పెరుగుతోందని, ఇవి అవసరమా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో జరిగే వివాహ వేడుకలు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తుచేశారు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ మార్చుకోవాలని, మాతృ గడ్డపై పెళ్లి చేసుకోవాలని ధనవంతులకు పిలుపునిచ్చారు.’మేడ్ ఇన్ ఇండియా’ తరహాలో భారతదేశానికి ‘వెడ్ ఇన్ ఇండియా’ వంటి ఉద్యమం అవసరమని అన్నారు. సంపన్న పారిశ్రామికవేత్తలు ప్రతి సంవత్సరం తమ కుటుంబాల్లో కనీసం ఒక డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ఉత్తరాఖండ్‌లో నిర్వహించాలని తన మన్‌కీ బాత్ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లను నిర్వహించడం ప్రారంభమై ఐదేళ్లపాటు కొనసాగితే అది అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా నిలుస్తుందని అన్నారు.
ప్రధాని మోదీ పిలుపుతో పలువురు సెలబ్రిటీలు, సంపన్న పారిశ్రామికవేత్తల పిల్లలు తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌లను రద్దు చేసుకుని సొంత గడ్డపైనే వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి తోడు విదేశీయులు భారత్‌లో తమ వివాహ వేడుకను జరిపించేందుకు ఇష్టపడుతున్నారు. ఆ రకంగానూ విదేశీ మారక ద్రవ్యం భారత్‌కు భారీగానే వచ్చి చేరుతోంది.
అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు..
మొన్నటికి మొన్న అంబానీ కుటుంబం ఆనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ మూలాలు ఉన్న జామ్ నగర్‌లోనే దీన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం వెనుక కారణం కూడా ప్రధాని మోదీ వెడ్ ఇన్ ఇండియా పిలుపే కారణం కావడం విశేషం. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కశ్మీర్‌ను కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఇటీవల కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మరోసారి వెడ్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం..
మన దేశంలో పెళ్లి వేడుక అంటే లక్షలు, కోట్లల్లో వ్యవహారం. ధనవంతుల ఇళ్లలో పెళ్లి వేడుకలు కనీసం వారం రోజులు సాగుతాయి. దీనికయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. అయితే ఈ పెళ్లి ఖర్చులు మన దేశంలోనే జరిగితే.. అది దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయ్యేందుకు దోహదపడుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట బయట దేశాల్లో వేడుకలు జరిగితే.. అదంతా ఆ దేశాలకు ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రస్తుతం జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనాలోనూ ఆర్థిక వృద్ధి రేటు అంత ఆశాజనకంగానే ఉంది. భారత్ జీడీపీ వృద్ధిరేటు అంచనాలు ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ జీడీపీ రేటు జోరును కొనసాగించేందుకు మ్యారేజ్ ఖర్చులు బయటి దేశాలకు ఆదాయ పనరుగా మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతోనే భారత ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. మరికొన్ని ఏళ్లలోనే జర్మనీ, జపాన్ దేశాలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి వివాహ రంగ ఆదాయం కూడా భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.