
భారతదేశంలో టీ అంటే ఇష్టపడనివారు తక్కువ మందే ఉంటారు. పొద్దున్నే టీ తాగనిది బెడ్ మీద నుంచే లేవనివారు కూడా చాలామంది ఉంటారు. ప్రతీ ఇంట్లో పొద్దున్నే టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. కొంతమంది అయితే రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు టీ తాగుతూ ఉంటారు. ఇక బయట ఎక్కడచూసినా టీ షాపులు జనాలతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కేవలం టీని ఇష్టపడటం కాదు.. టీ వ్యాపారం ద్వారా నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు. చిన్న రూ.10 టీ అమ్మడం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయ పొందుతున్న వ్యాపారులు ఉన్నారు. అందులో ఒకరు శర్మ కేఫ్ రెస్టారెంట్ యజమాని.
శర్మ కేఫ్ రెస్టారెంట్ యజమానికి చెందిన ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఆయన టీ వ్యాపారం, ఆదాయం గురించి కీలక వివరాలు వెల్లడించారు. “నా టీ స్టాల్ 55-56 ఏళ్లుగా నడుస్తోంది. కస్టమర్లకు నాణ్యమైన టీని అందిస్తున్నాం. ఒక్కొ టీ కప్పు ధర రూ.10కి విక్రయిస్తున్నాం. ప్రతీ రోజూ 3 వేల కప్పుల టీని అమ్ముతున్నాం. దీని వల్ల రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం లభిస్తోంది. అంటే నెలకు రూ.7.50 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. 30 నుంచి 35 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. టీ, పాలు, పంచదార, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లు వంటివి పోనూ తనకు ఆదాయం బాగానే ఉంది. ఒక్క టీ వ్యాపారం ద్వారానే నేను నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నా. దేనిని తేలికగా తీసుకోవవద్దని యువతకు సూచిస్తున్నా” అంటూ ఆయన ఈ వీడియోలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వంటి వారిని తాను స్పూర్తిగా తీసుకుంటున్నట్లు ఈ వ్యాపారి వీడియోలో తెలిపాడు. ప్రతీఒక్కరూ క్రింది స్థాయి నుంచే వచ్చి ఇవాళ ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశాడు. చిన్న వ్యాపారంతో కూడా పైస్థాయికి ఎదగవచ్చని, ఏది తక్కువగా తీసుకోకూడదన్నాడు. మోదీ ఒకప్పుడు టీ అమ్మేవారని, ఇప్పుడు భారత ప్రధాని అమ్మారని ఉదాహరణగా చెప్పాడు. ఎలాన్ మాస్క్ కూడా ఒకప్పుడు సేల్స్‌మెన్‌గా ఉండేవాడని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల స్థాయికి చేరుకున్నాడని గుర్తు చేశారు. వ్యాపారంలో ఎదగడానికి కుటుంబ సంపద,ఆర్ధిక లాభం అవసరం లేదని, కష్టపడటం వల్ల విజయం సాధించవచ్చని సూచించాడు. రూ.10 వేలు వంటి చిన్న ఖర్చుతో వ్యాపారం ప్రారంభించాలని యువతకు సూచించాడు. చిన్న ఖర్చుతో ప్రారంభించడం వల్ల వ్యాపారంలో మెళుకువలు, లాభనష్టాల గురించి అవగాహన వస్తుందని, ఆ తర్వాత విస్తరించుకోవచ్చన్నాు. అనుభవం నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని, యువత పెద్ద వ్యాపారం స్టార్ట్ చేసేముందు ఖర్చులను అర్థం చేసుకోవాలన్నారు.