వాహన ప్రియులకు గుడ్‌న్యూస్.. 310 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు!

సుజుకి తన తొలి ప్రొడక్షన్-రెడీ ఎలక్ట్రిక్ కీ కారు e-Skyని ఆవిష్కరించింది. 310 కిలోమీటర్ల రేంజ్ అందించే ఈ కాంపాక్ట్ ఈవీ, చిన్న పరిమాణంలోనే ఎక్కువ క్యాబిన్ స్పేస్ కలిగి ఉంది. సుమారు 26 లక్షల ప్రారంభ ధరతో యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ కారు 63 bhp పవర్, అధునాతన టెక్నాలజీతో నగర ప్రయాణాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇది సుజుకి గ్లోబల్ ఈవీ వ్యూహంలో కీలక అడుగు.

వాహన ప్రియులకు గుడ్‌న్యూస్.. 310 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు!
Suzuki E Sky Ev

Updated on: Aug 27, 2026 | 11:14 AM

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సుజుకి కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం తన తొలి ప్రొడక్షన్-రెడీ ఎలక్ట్రిక్ కీ కార్ e-Skyని ఆవిష్కరించింది. జపాన్ కీ-కార్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ కాంపాక్ట్ ఈవీ.. చిన్న పరిమాణంలోనే ఎక్కువ క్యాబిన్ స్పేస్ అందించేలా బాక్సీ, నిటారుగా ఉండే డిజైన్‌తో రూపొందింది. యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లో దీని ప్రారంభ ధర 20,000 పౌండ్లు (సుమారు రూ.26.08 లక్షలు) ఉండే అవకాశం ఉంది.

డిజైన్ ఎలా ఉంది?

గత ఏడాది టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ e-Sky చాలా దగ్గరగా ఉంటుంది. అయితే సిరీస్ ప్రొడక్షన్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. కాన్సెప్ట్‌లో కనిపించిన క్లిష్టమైన LED లైటింగ్ స్థానంలో మరింత సింపుల్, ప్రాక్టికల్ లైటింగ్ సెటప్‌ను తీసుకొచ్చారు. ఎత్తైన బాడీ, కాంపాక్ట్ కొలతలు, నిటారుగా ఉండే నిర్మాణం ఈ కారు ప్రత్యేకతలు.

310 కిమీ రేంజ్.. 63 bhp పవర్

e-Skyలో సుమారు 63 bhp శక్తిని ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 310 కిలోమీటర్ల రేంజ్ అందించేలా ఈవీని రూపొందించారు. నగర ప్రయాణాలు, రోజువారీ కమ్యూటింగ్‌కు ఈ రేంజ్ ఉపయోగకరంగా ఉండనుంది.

కొలతలు ఇవే..

సుజుకి e-Sky పొడవు 3,395 మిమీ, వెడల్పు 1,475 మిమీ, ఎత్తు 1,625 మిమీగా ఉంది. వీల్‌బేస్ 2,460 మిమీ. కారు కర్బ్ బరువు సుమారు 1,030 కిలోలు కాగా, టర్నింగ్ రేడియస్ 4.4 మీటర్లుగా ఉంది. దీంతో రద్దీగా ఉండే నగర రోడ్లపై సులభంగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో బ్యాటరీపై అదనపు భారం పడకుండా క్యాబిన్‌ను వేడి చేసేందుకు డైరెక్ట్ హీట్-పంప్ సిస్టమ్, ఎయిర్-హీటెడ్ ఎలక్ట్రిక్ హీటర్‌ను కూడా ఇందులో అందించారు.

టెక్నాలజీ అదుర్స్!

క్యాబిన్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. EVలకు ప్రత్యేకంగా రూపొందించిన కనెక్టెడ్ నావిగేషన్ సిస్టమ్ బ్యాటరీ ఛార్జ్, ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మార్గాలను, ఛార్జింగ్ స్టేషన్లను సూచిస్తుంది. అలాగే Easy Drive Pedal ఫీచర్ యాక్సిలరేటర్‌ను విడుదల చేసినప్పుడు వాహనం వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో డ్రైవర్‌కు పెడల్ ఆపరేషన్ కొంత సులభమవుతుంది. Vehicle-to-Load (V2L) ఫంక్షన్ ద్వారా కారులోని బ్యాటరీ పవర్‌ను బాహ్య పరికరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

గ్లోబల్ మార్కెట్లపై సుజుకి ఫోకస్

e-Skyతో సుజుకి గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన వ్యూహాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చిన్న, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకెళ్లే ఈ కారు భవిష్యత్తులో సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు కీలక మోడల్‌గా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us