ఇల్లు కట్టిస్తున్నారా.. ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. తక్కువ ధరలో ఏది మంచిదో తెలుసుకోండి!

ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఎర్ర ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు, ప్లాస్టిక్ ఇటుకల్లో ఏది ఎక్కువ బలం ఇస్తుంది? ఏది తక్కువ ఖర్చుతో నిర్మాణాన్ని పూర్తి చేయడంలో సహాయపడుతుంది? మీ బడ్జెట్‌కు, మీ ఇంటికి సరైన ఇటుకను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇల్లు కట్టిస్తున్నారా.. ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. తక్కువ ధరలో ఏది మంచిదో తెలుసుకోండి!
Red Brick Vs Cement Brick Vs Fly Ash Brick

Updated on: Aug 05, 2026 | 4:14 PM

సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను నిజం చేసుకునే సమయంలో సరైన నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటి బలం, నిర్మాణ వ్యయం, దీర్ఘకాల మన్నిక వంటి అంశాలు ఎక్కువగా ఇటుకల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. గతంలో ఎక్కువగా సాంప్రదాయ ఎర్ర ఇటుకలనే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెందడంతో సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు, ప్లాస్టిక్ ఇటుకలు వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏది మంచిది? ఏది తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం ఇస్తుంది? అనే అంశాలను తెలుసుకుందాం.

ఎర్ర ఇటుకలు

ఎర్ర ఇటుకలు మట్టి, నీటితో తయారు చేసి అధిక ఉష్ణోగ్రతలో కాల్చడం ద్వారా తయారవుతాయి. ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో ఇళ్ల నిర్మాణానికి ఇవే ప్రధాన ఎంపికగా ఉన్నాయి. అయితే ఈ ఇటుకలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం, నాణ్యత ప్రాంతానికో ప్రాంతం మారడం వంటి పరిమితులు ఉన్నాయి. అలాగే గోడ నిర్మాణానికి ఎక్కువ మోర్టార్ (సిమెంట్, ఇసుక మిశ్రమం) అవసరమవుతుంది.

సిమెంట్ ఇటుకలు

ప్రస్తుతం కాంక్రీట్ బ్లాకులు లేదా సిమెంట్ ఇటుకల వినియోగం వేగంగా పెరుగుతోంది. వీటిని సిమెంట్, రాతి పొడి, కంకర మిశ్రమంతో తయారు చేస్తారు. పరిమాణంలో పెద్దగా ఉండటంతో తక్కువ ఇటుకలతోనే ఎక్కువ ఎత్తులో గోడ నిర్మించవచ్చు. మోర్టార్ వినియోగం కూడా తగ్గుతుంది. దీంతో సిమెంట్, ఇసుక ఖర్చు ఆదా అవుతుంది. బరువును తట్టుకునే సామర్థ్యం కూడా ఎర్ర ఇటుకల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఫ్లై యాష్ ఇటుకలు

థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే ఫ్లై యాష్, సిమెంట్, ఇసుక మిశ్రమంతో ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఆకారం ఒకే విధంగా ఉండటంతో గోడలు సమానంగా నిర్మించవచ్చు. ప్లాస్టరింగ్‌కు తక్కువ మోర్టార్ అవసరం కావడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసే నిర్మాణ సామగ్రిగా కూడా ఫ్లై యాష్ ఇటుకలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ప్లాస్టిక్ ఇటుకలు

ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేస్తున్న ప్లాస్టిక్ ఇటుకలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. వ్యర్థ ప్లాస్టిక్‌ను కరిగించి ఇతర పదార్థాలతో కలిపి వీటిని తయారు చేస్తారు. ఇవి జలనిరోధక లక్షణాలు కలిగి ఉండటంతో పాటు తేమను కూడా తట్టుకుంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి సాధారణ ఎర్ర ఇటుకల కంటే ఎక్కువ బలం కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి ఇంకా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగంలోకి రాలేదు.

ఏ ఇటుకలు ఎంచుకోవాలి?

ఇంటి నిర్మాణానికి ఏ ఇటుకలు ఉపయోగించాలనేది ప్రాంతం, నిర్మాణ రకం, బడ్జెట్, ఇంజినీరింగ్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు మంచి బలాన్ని అందిస్తాయి. ప్లాస్టిక్ ఇటుకలు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటి వినియోగం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. ఇల్లు నిర్మించే ముందు కేవలం ధర ఆధారంగా కాకుండా, ఇటుకల నాణ్యత, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, నీటిని పీల్చుకునే శాతం, స్థానిక వాతావరణ పరిస్థితులు, నిర్మాణ నిపుణుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సరైన ఇటుకలను ఎంచుకుంటే నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, ఇల్లు మరింత దృఢంగా, ఎక్కువ కాలం మన్నేలా నిర్మించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us