ఎమర్జెన్సీ టైమ్‌లో పర్సనల్‌ లోన్‌ vs క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌.. ఏది తీసుకోవాలంటే?

అత్యవసర ఖర్చుల సమయంలో పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌లలో ఏది ఎంచుకోవాలో చాలామందికి సందిగ్ధత ఉంటుంది. తక్కువ వడ్డీ, స్థిర EMIలతో పర్సనల్‌ లోన్‌ సురక్షిత ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి బకాయిలు చెల్లించకపోతే క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు భారీ భారం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎమర్జెన్సీ టైమ్‌లో పర్సనల్‌ లోన్‌ vs క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌.. ఏది తీసుకోవాలంటే?
Personal Loan, Credit Card

Updated on: May 24, 2026 | 3:37 PM

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు చాలామంది ముందుగా పర్సనల్‌ లోన్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌ను ఆశ్రయిస్తారు. అయితే ఈ రెండు రకాల రుణాల మధ్య వడ్డీ రేట్లు, ఛార్జీలు, తిరిగి చెల్లింపు విధానం వంటి అంశాల్లో గణనీయమైన తేడాలు ఉంటాయి. సరైన ఎంపిక చేసుకోకపోతే రుణభారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్‌ లోన్‌ అనేది నిర్దిష్ట కాలపరిమితి, స్థిర వడ్డీ రేటుతో ఇచ్చే రుణం. ఇందులో ప్రతి నెలా సమాన EMIలను చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌ రివాల్వింగ్‌ క్రెడిట్‌ విధానంలో పనిచేస్తుంది. కార్డుకు కేటాయించిన పరిమితి వరకు ఎప్పుడైనా ఖర్చు చేయవచ్చు. అయితే బకాయిని పూర్తిగా చెల్లించకపోతే అధిక వడ్డీ వర్తిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ వడ్డీ రేట్లు నెలకు 1.99 శాతం నుంచి 3.75 శాతం వరకు ఉండగా, వార్షికంగా 55 శాతం వరకు చేరే అవకాశం ఉంది.

పర్సనల్‌ లోన్‌లపై ప్రాసెసింగ్‌ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు HDFC, ICICI, Axis బ్యాంక్‌ వంటి బ్యాంకులు రుణ మొత్తంపై 1 నుంచి 5 శాతం వరకు ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటంతో రుణభారం ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌లో మాత్రం సమయానికి చెల్లింపులు చేయకపోతే వడ్డీ చక్రవడ్డీగా పెరుగుతుంది. ఆలస్య చెల్లింపులకు జరిమానాలు కూడా విధిస్తారు. దీంతో చిన్న మొత్తంతో ప్రారంభమైన బకాయి భారీ రుణంగా మారే ప్రమాదం ఉంటుంది.

ఇటీవల RBI వడ్డీ రేట్ల తగ్గింపుతో పర్సనల్‌ లోన్‌లు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అయితే గృహ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య అత్యవసరాలు, పెద్ద ఖర్చుల కోసం తక్కువ వడ్డీతో స్థిర EMIలు ఉండే పర్సనల్‌ లోన్‌ సురక్షిత ఎంపికగా పరిగణిస్తున్నారు. అయితే చిన్నకాలంలో బకాయిని పూర్తిగా క్లియర్‌ చేయగలిగితే మాత్రమే క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌ ఉపయోగకరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us